దేశమంతటా ఉద్యమస్ఫూర్తి

3 Oct, 2014 01:15 IST|Sakshi
దేశమంతటా ఉద్యమస్ఫూర్తి

న్యూఢిల్లీ: ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా దాదాపు అన్ని వర్గాల ప్రజలు గురువారం దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో ఉద్యమస్ఫూర్తితో పాలు పంచుకున్నారు. గాంధీ జయంతి సందర్బంగా సెలవురోజైనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లి స్వచ్ఛ్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. చీపుర్లు పట్టి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేసుకున్నారు.

లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్లో, అనంతరం బాలు అడ్డాలోని వాల్మీకి ఏరియాలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, అలహాబాద్‌లో బీజేపీ అగ్రనేత అద్వానీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం ఝాన్సీలోని పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి ఉమాభారతి పరిశుభ్ర భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్లాస్టిక్‌ను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరిన్ని వార్తలు