‘ఈ పదేళ్లు జైలులో గడిపినట్లుంది’

5 Feb, 2019 17:17 IST|Sakshi

శ్రీనగర్‌ : ఐఏఎస్‌ అధికారిగా ఉన్న ఈ పదేళ్లు నాకు జైలులో గడిపినట్లనిపించింది అంటున్నారు మాజీ ఐఏఎస్‌ అధికారి షా ఫజల్‌. 2009లో సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన తొలి కశ్మీరీగా చరిత్ర సృష్టించిన ఫజల్‌.. గత నెలలో తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగానికి రాజీనామ చేసిన తరువాత తొలిసారి ఓ పబ్లిక్‌ మీటింగ్‌కు హాజరయ్యారు ఫజల్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాలకు వెళ్తే నా కుటుంబంతో కలిసి చాల సౌకర్యవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికి కూడా.. నేను అలా చేయలేదు. నా ప్రజల కోసం ఇక్కడే ఉండాలనుకున్నాను. ప్రజలకు, అధికారులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలనుకున్నాను. ఐఏఎస్‌ను ఎంచుకున్నాను’ అని తెలిపారు.

అంతేకాక ‘ఈ పదేళ్లలో నా ప్రజలకు ఎన్నో సేవలు చేశాను. దాంతో పాటు సర్వీసు కాలంలో ఎన్నో అన్యాయాలను, అమానుషాలను కూడా చూశాను. వీటన్నింటి గురించి విన్నప్పడు నేను చాలా నిస్సహాయుడినని భావించేవాడిని. నిజం చెప్తున్న.. ఈ పదేళ్లు జైలులో ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఉద్యోగాన్ని వదిలేశాను. ఇక మీదట ఊరూరా తిరుగుతు ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తాన’ని తెలిపాడు. అంతేకాక కశ్మీర్‌ ప్రజల గురించి మాట్లాడ్డానికి.. వారి సమస్యల గురించి పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటించాడు. అవినీతి రహిత రాజకీయాల కోసం తాను పాటుపడతానని.. అందుకే ఏ పార్టీలో చేరబోనని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపాడు షా ఫజల్‌.

మరిన్ని వార్తలు