సీజేఐ వేధింపుల కేసుపై విచారణ ప్రారంభం

27 Apr, 2019 03:37 IST|Sakshi

అంతర్గత కమిటీ ముందు హాజరైన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్‌ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో విచారణను ముగ్గురు జడ్జీల అంతర్గత కమిటీ శుక్రవారం ప్రారంభించింది. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీల కమిటీ ఎదుట ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని విచారణకు హాజరయ్యారు. జస్టిస్‌ బాబ్డే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండటం తెలిసిందే. మాజీ ఉద్యోగినితోపాటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ కమిటీ విచారణకు వచ్చారు. అయితే విచారణ సమయంలో జడ్జీల ముందు మహిళ మాత్రమే ఉన్నారు.

ఇది సాధారణ న్యాయ విచారణ కానందున న్యాయవాదులను విచారణ సమయంలో మహిళతోపాటు ఉండేందుకు అనుమతించబోమని జస్టిస్‌ బాబ్డే ఇంతకుముందే స్పష్టం చేయడం గమనార్హం. ఈ విచారణను ముగించేందుకు నిర్దిష్ట గడువు కూడా ఏదీ లేదని జస్టిస్‌ బాబ్డే గతంలోనే చెప్పారు. ఈ విచారణలో వెలుగుచూసే అంశాలను కూడా రహస్యంగానే ఉంచనున్నారు. ఆరోపణలు చేసిన మహిళ గతంలో సీజేఐ ఇంట్లోని కార్యాలయంలో పనిచేసేది. గతేడాది అక్టోబర్‌లో సీజేఐ తనను లైంగికంగా వేధించారనీ, ఖండించినందుకు తనను ఉద్యోగంలోనుంచి తీసేయడంతోపాటు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న తన భర్త, మరిదిలను సస్పెండ్‌ చేయించారని ఆరోపిస్తూ 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆమె లేఖలు పంపారు.

మరిన్ని వార్తలు