సీఎం ఉద్వాసనకు రంగం సిద్ధం!

16 May, 2016 16:47 IST|Sakshi
సీఎం ఉద్వాసనకు రంగం సిద్ధం!

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమెను మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగితే నెగ్గుకురావడం కష్టమని కాషాయ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆనంది బెన్ పటేల్ ను తొలగించి నితిన్ భాయ్ పటేల్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆనంది బెన్ పటేల్ ను గవర్నర్ గా నియమించే అవకాశముందని తెలిపాయి.

అసెంబ్లీ ఎన్నికల కోసం అవలంభించాల్సిన వ్యూహంపై రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి నివేదిక సమర్పించారని తెలుస్తోంది. గుజరాత్ సీఎం మార్పిడితో పాటు కేంద్ర కేబినెట్ లోనూ మార్పులు, చేర్పులు జరగనున్నాయని ఢిల్లీలో జోరుగా ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు