ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా?

13 Feb, 2017 20:27 IST|Sakshi
ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో శనివారం జరిగిన తొలి విడత పోలింగ్‌పై నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రచురించిన దేశంలోని అతి పెద్ద హిందీ పత్రిక ‘దైనిక్‌ జాగరన్‌’పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు మిగతా విడతల పోలింగ్‌పై నిజంగా ప్రభావం చూపిస్తాయా? చూపిస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అసలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు నిజమవుతాయా? నిజమయ్యేది ఉంటే గతంలో పలు పత్రికలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు పరస్పరం విరుద్ధంగా ఎందుకున్నాయి? ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను నిషేధించడం సమంజసమేనా?

పలు విడుతలుగా జరిగే ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్‌పై నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు రెండు విధాలుగా ప్రభావం చూపిస్తాయని ఎన్నికలు కమిషన్‌ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. ఎన్నికల గాలి ఎటువైపు వీస్తున్నదో తెలిసి ఓటరు తన ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశంతో గెలిచే పార్టీవైపు మొగ్గుచూపుతారన్నది ఒక కారణం కాగా, ఓడిపోయే పరిస్థితి ఉందనుకున్న రాజకీయ పార్టీలు గెలుపుకోసం చివరి నిమిషంలో ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసే ప్రమాదం ఉందన్నది రెండో కారణం. ఈ కారణాలతోనే  2008లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తీసుకరావడం ద్వారా ఎన్నికల ముగియకుండానే ఎగ్జిట్‌ పోల్స్‌ను నిర్వహించ కూడదని, వాటి ఫలితాలను ప్రచురించరాదంటూ నిషేధం తీసుకొచ్చారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణపై నిషేధం విధించడమంటే ప్రజల భావ ప్రకటన స్వాతంత్య్రాన్ని హరించడమేనని మొదటి నుంచి మీడియా ఆరోపిస్తోంది. తమ రాజకీయ అనుబంధాన్ని బట్టి మీడియా కూడా తప్పుడు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించవచ్చని, ఓటరు కూడా తప్పుదోవ పట్టించేందుకు ఒక పార్టీకి ఓటేసి, మరో పార్టీకి ఓటేసునట్లు చెప్పవచ్చని అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం మవుతున్నాయి. ఇందులో ఏదీ జరిగినా తదుపరి విడత పోలింగ్‌ల్లో పాల్గొనే ఓటరుపై ప్రభావం ఉంటుందని మాజీ ఎన్నికల కమిషనర్‌ ఖురేషి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం అందరిపైన ఉండదని, అనిశ్చితంగా ఉండే ఓటరుపైనే ఉంటుందని వాదిస్తున్న వారు లేకపోలేదు.
 
ఓపీనియన్‌ పోల్స్‌లో యూపీ ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయలకు భిన్నంగా దైనిక్‌ జాగరన్‌ పత్రిక వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఉన్నాయి. అంటే తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ పత్రిక తర్వాత విడతల ఓటర్లను ప్రభావితం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను చూపించి ఉండాలి. లేదా అండర్‌ కరంట్‌గా ఓ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటున్న ఓటర్లు ఎగ్జిట్‌ పోల్స్‌నే తప్పుదారి పట్టించి ఉండాలి. చివరకు ఏ ఫలితమొచ్చినా అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చే తీర్పే అవుతుంది.

మరిన్ని వార్తలు