అచ్ఛేదిన్‌ ఎప్పుడన్న శివసేన..

4 Sep, 2017 15:14 IST|Sakshi
అచ్ఛేదిన్‌ ఎప్పుడన్న శివసేన..
ముంబయిః కేం‍ద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ పట్ల అసంతృప్తిగా ఉన్న బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి బీజేపీపై మండిపడింది. మోడీ సర్కార్‌ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటినా ప్రయోగాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రజలు మాత్రం మంచిరోజుల కోసం ఇంకా వేచిచూస్తూనే ఉన్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన వ్యాఖ్యానించింది. మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ, శాఖల కేటాయింపు బీజేపీ అంతర్గత వ్యవహరమని, అయితే ఇది జాతీయ భద్రత, దేశ అభివృద్ధిపై ప్రభావం చూపితే తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించింది. మోడీ, అమిత్‌ షాలు తమకు నచ్చిన వారికి మంత్రులుగా పట్టం కట్టారని వ్యాఖ్యానించింది. 
 
కొందరిని వయోభారం పేరుతో కేబినెట్‌ నుంచి తప్పించారని, అయితే వారి యువ మంత్రులు సైతం కొందరు సరైన పనితీరు కనబరచలేదని పెదవివిరిచింది. ‘నోట్ల రద్దు పూర్తిగా విఫలమైంది... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రబలుతున్నాయి...ప్రజలకు మౌలిక వసతులూ అందుబాటులో లేకుండా పోయాయి' అని సంపాదకీయం మోడీ సర్కార్‌ను దుయ్యబట్టింది.
మరిన్ని వార్తలు