కోహినూర్‌ తెచ్చేందుకు ఏం చేశారు?

4 Jun, 2018 01:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పురాతన, అమూల్యమైన వస్తువులను తిరిగి భారత్‌కు తెప్పించే విషయమై తీసుకున్న చర్యలేమిటో తెలపాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), విదేశాంగశాఖను కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ఆదేశించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్‌ వజ్రం, సుల్తాన్‌గంజ్‌ బుద్ధ, నాసక్‌ వజ్రం, టిప్పు సుల్తాన్‌ ఖడ్గం, ఉంగరం, పులి బొమ్మ, మహారాజా రంజిత్‌సింగ్‌ బంగారు సింహాసనం, షాజహాన్‌ వినియోగించిన మరకత గ్లాసు, సరస్వతి విగ్రహం తదితరాలను భారత్‌కు తిరిగి తెప్పించేందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త బీకేఎస్‌ఆర్‌ అయ్యంగార్‌ దరఖాస్తు చేశారు. దీన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కు బదిలీ చేశారు.

స్పందించిన ఏఎస్‌ఐ.. విలువైన వస్తువులను తిరిగి తెప్పించే అంశం తమ పరిధిలోనిది కాదని బదులిచ్చింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించిన అమూల్యమైన వస్తువులను మాత్రమే తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు తమ శాఖ కృషి చేస్తుందని, బ్రిటిష్‌ కాలంలో తరలిపోయిన వస్తువులను తిరిగి తెచ్చే అధికారం తమకు లేదని సమాధానమిచ్చింది. ఈ విషయం తెలిసి కూడా పీఎంవో, విదేశాంగ శాఖ.. ఆర్టీఐ దరఖాస్తును ఏఎస్‌ఐకి ప్రతిపాదించడంపై సీఐసీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న వారసత్వ సంపదను తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా