ఎన్టీపీసీలో పేలుడు.. 26 మంది మృతి

2 Nov, 2017 02:05 IST|Sakshi

100 మందికి గాయాలు 

యూపీలోని రాయ్‌బరేలీలో దుర్ఘటన

లక్నో: కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్టీపీసీ) కర్మాగారంలో ఓ బాయిలర్‌ పేలిపోవడంతో 26 మంది మృతి చెందగా, సుమారు 100 మందికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీ జిల్లాలోని ఉంచహర్‌ ప్లాంట్‌లో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లుఅధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు లక్నో నుంచి జాతీయ విపత్తు స్పందనా బృందాన్ని(ఎన్డీఆర్‌ఎఫ్‌) హుటాహుటిన ప్రమాద స్థలికి పంపారు. పేలుడుకు కారణం తెలుసుకునేందుకు ఎన్టీపీసీ విచారణను ప్రారంభించింది. ఉంచహర్‌ ప్లాంట్‌లోని ఆరో యూనిట్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు 20 మీటర్ల ఎత్తులో పెద్ద శబ్దంతో ఈ ప్రమాదం సంభవించిందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో ఒక్కసారిగా బయటికి వచ్చిన వేడి వాయువులు, నీటి ఆవిరితో సమీపంలో పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారని తెలిపింది. ఈ సంఘటన దురదృష్టకరమని, జిల్లా అధికారుల సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేశామని ఓ ప్రకటనలో తెలిపింది.  

సహాయక చర్యలు ముమ్మరం: ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు వల్ల 26 మంది మృతిచెందగా, 100 మందికి గాయాలైనట్లు యూపీ అదనపు డీజీపీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. కాలిన గాయాలు తీవ్రంగా ఉన్న వారిని లక్నోకు తరలించామని, మరో 15 మంది రాయ్‌బరేలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. పేలుడు చోటుచేసుకోగానే అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా భయంతో పరుగులు పెట్టారని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించామని, అక్కడికి అంబులెన్స్‌లు పంపి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. బాధితులకు తక్షణమే చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించామని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రాయ్‌బరేలీ అదనపు కలెక్టర్‌ అదనపు ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లారు.  

యోగి, సోనియా విచారం 
ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మూడు రోజుల మారిషస్‌ పర్యటనలో ఉన్న ఆయన సహాయ కార్యకలాపాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తన నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె... క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. సహాయక కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు సాయంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను కోరారు.        

మరిన్ని వార్తలు