నిబంధనల ఉల్లంఘనతో పేలుడు

12 Apr, 2016 02:00 IST|Sakshi
నిబంధనల ఉల్లంఘనతో పేలుడు

కేరళ ఆలయంలో విషాదంపై విచారణ
ఆరుగురిపై హత్యాయత్నం కేసు

 
♦ 109కి చేరిన మృతుల సంఖ్య
♦ పరారీలోనే పుట్టింగల్ ఆలయ కమిటీ అధికారులు
♦ పటాసుల పోటీపై నిషేధం విధించాలని హైకోర్టు జడ్జి లేఖ
♦ నిషేధాన్ని అంగీకరించబోమని చెప్పిన ట్రావెన్‌కోర్ బోర్డు
 
 కొల్లాం: పేలుడు పదార్థాలపై నిబంధనల ఉల్లంఘన, నిషేధిత రసాయనాల వాడకం వల్లనే కేరళలోని పుట్టింగల్ ఆలయంలో విషాదం జరిగిందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన పేలుడు పదార్థాల నియంత్రణ ఉన్నతాధికార బృందం సోమవారం ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి ఆలయ అధికారులతోపాటు ఆరుమందిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. సోమవారం మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య 109కి పెరిగింది. 300 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఆదివారం తెల్లవారుజామున కొల్లాం జిల్లాలోని పరువూర్‌లో వందేళ్ల నాటి పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలిన సంగతి తెలిసిందే. ఆలయాన్ని సోమవారం కూడా మూసే ఉంచారు. సంప్రదాయబద్ధమైన పూజాధికాలూ జరగలేదు. హత్యాయత్నం అభియోగాలు ఆలయ కమిటీకి చెందిన అధికారులతోపాటు ఆరుమందిపై ఐపీసీలోని పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 307 (హత్యాయత్నం), 308 (ఉద్దేశపూర్వకంకాని హత్యాయత్నం) కింద పోలీసులు కేసు నమోదుచేశారు. బాణసంచా ప్రదర్శనపై జిల్లా కలెక్టర్ నిషేధం విధించినప్పటికీ, దాన్ని తోసిరాజని పోటీని నిర్వహించినందుకు కాంట్రాక్టర్ల సహాయకులపైనా అభియోగాలు నమోదుచేశారు.

ప్రమాదం తర్వాత పారిపోయిన ఆలయ కమిటీలోని 15 మంది సభ్యులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన పేలుడు పదార్థాల చీఫ్ కంట్రోలర్ సుదర్శన్ కమల్ ఆలయాన్ని సందర్శించి ఆధారాలను సేకరించారు.  కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, నిబంధనల ఉల్లంఘన వల్లనే ప్రమాదం సంభవించిందన్నారు.   ‘తయారీదారులు బాణసంచాలో నిషేధిత రసాయనాలు వాడారు. వాటితో ప్రదర్శన నిర్వహించారు’ అని ఆయన చెప్పారు.  బాణాసంచా అనుమతి అంశంతోపాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతామని  క్రైమ్‌బ్రాంచ్ ఇంచార్జి ఎస్.అనంతక్రిష్ణన్ చెప్పారు. అట్టింగల్ దగ్గర్లోని గోడౌన్ నుంచి పోలీసులు 100 కిలోల పేలుడు పదార్థాల సామగ్రిని సీజ్ చేశారు. పటాసుల ముడిపదార్థాలున్న రెండు కార్లనూ స్వాధీనం చేసుకున్నారు.

 స్థానికులు షాక్‌లోనే... ఈ ప్రమాద షాక్ నుంచి స్థానికులు తేరుకోలేదు. మృతులకు భార హృదయంతో కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆస్పత్రి(టీఎంసీహెచ్)తోపాటు క్షతగాత్రులున్న ఇతర ఆస్పత్రులు ఇంకా భీతావహంగానే ఉన్నాయి. బంధువులు, సన్నిహితులు తమ వారి మృతదేహాల కోసం మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

 అనుమతి ఇవ్వలేదు: కొల్లాం కలెక్టర్
 ఆలయంలో బాణసంచా పోటీకి తాను అనుమతి ఇవ్వలేదని కొల్లాం జిల్లా కలెక్టర్ ఎ.షైనమోల్ స్పష్టంచేశారు. ‘తొలుత అనుమతి నిరాకరించాలని పోలీసులు నాకు నివేదించారు.  తర్వాత ఈనెల 9న వారు వైఖరి మార్చుకున్నారన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆదేశించాన’న్నారు.
 
 బాణసంచాపై నిషేధాన్ని ఒప్పుకోం: ట్రావెన్‌కోర్ బోర్డు
 పుట్టింగల్  విషాదం నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతుండగా, నిషేధాన్ని అంగీకరించబోమని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) పేర్కొంది. గుళ్ల ఉత్సవాల్లో బాణసంచా ప్రదర్శనలు  భాగమని, అందువల్ల బాణసంచా పోటీలపై నిషేధానికి తాము వ్యతిరేకమని టీడీబీ అధ్యక్షుడు గోపాలక్రిష్ణన్ స్పష్టంచేశారు. ప్రభుత్వ, కోర్టు ఆంక్షల మేరకు సురక్షిత చర్యలు చేపట్టి బాణసంచా పోటీలకు అనుమతి ఇవ్వాలన్నారు. నిబంధనల మేరకే పటాసుల ప్రదర్శన నిర్వహించాలని తన పర్యవేక్షణలోని 1,255 ఆలయాలకు టీడీబీ అత్యవసర ఆదేశాలు జారీచేసింది. కాగా, అన్ని ఆలయాల్లో భారీ పేలుడు పదార్థాల వాడకంపై తక్షణమే నిషేధం విధించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ వి.చిత్రాంబరేశ్ కోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. ఈ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించవచ్చన్నారు. ఆలయాల వ్యవహారాలను చూసే హైకోర్టు దేవస్థానం బెంచ్ దీన్ని మంగళవారం విచారణకు స్వీకరించే అవకాశముంది.

మరిన్ని వార్తలు