ఎగుమతుల సబ్సిడీలకు డబ్య్లూటీవో ఆటంకాలు

7 Feb, 2020 19:51 IST|Sakshi

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ : ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వివాదాన్ని లేవనెత్తిన విషయం వాస్తవమేనని వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల సబ్సిడీ పథకం నిబంధనలకు అనుగుణంగా లేదంటూ డబ్ల్యూటీవో భారత దేశానికి వ్యతిరేకంగా వివాదాన్ని లేవనెత్తిందని చెప్పారు. 

ప్యానల్ దశలో ఇండియా తన కేసును వాదించింది. కానీ వివాద పరిష్కార ప్యానల్ మాత్రం భారత్ చేపట్టిన చర్యలు డబ్ల్యూటీవో నిబంధనలకు విరుద్ధమని తన నివేదికలో పేర్కొంది. ప్యానల్ నివేదికను భారత్ 19 నవంబర్ 2019న  అప్పిలేట్ సంఘం వద్ద సవాలు చేసింది. కానీ తగినంత కోరం లేని కారణంగా కేసులో పురోగతి లేదు. అయినప్పటికీ డబ్ల్యూటీవోలోని ఇతర సభ్యులతో కలసి అప్పిలేట్ సంఘం వద్ద ఈ కేసును అనుకూలంగా పరిష్కరించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అయితే ఈ దశలో కేసు మనకు అననుకూలంగా పరిష్కారం అవుతుందో లేదో చెప్పలేమని అన్నారు.

మరిన్ని వార్తలు