కమాన్ అరెస్ట్ మీ అంటూ సవాల్...

2 Nov, 2016 19:16 IST|Sakshi
మాజీ జవాన్ ఆత్మహత్యపై ఢిల్లీలో హైడ్రామా
న్యూఢిల్లీ : మాజీ ఆర్మీ జవాన్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పోలీసులు నిర్భందంలోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న జవాన్ కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు ఈ రోజు సాయంత్రం రామ్ మనోహర్ లోహియ ఆస్పత్రికి వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ మేరకు ఢిల్లీ టూరిజం శాఖ మంత్రి కపిల్ మిశ్రా ట్విట్ చేశారు. అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ మాకెన్ సహా పలువురు నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పెన్ష‌న్ అమ‌లు చేయ‌లేదంటూ మనస్తాపంతో మాజీ ఆర్మీ ఉద్యోగి రామ్ కిషన్ గ్రేవాల్ మంగళవారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
 
ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ను పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. కొద్దిసేపు అనంతరం రాహుల్ను విడుదల చేయగా, ఆయన మరోసారి బాధిత కుటుంబానికి కలవడంతో మళ్లీ అదుపులోకి తీసుకుని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో  రాహుల్ తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు.
 
న్యాయం చేయాల్సింది పోయి, మృతుడి కుమారుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రాహుల్ సవాల్ విసిరారు. ఒక యోధుడి కుమారుడి పట్ల అలా ప్రవర్తించడం దారుణమన్నారు. ఇది సిగ్గుచేటు చర్య అని ఆయన అభివర్ణించారు. రెండోసారి అదుపులోకి తీసుకున్న రాహుల్ ను పోలీసులు  తిలక్ మార్గ్ పీఎస్కు తరలించారు.
 
అంతకు ముందు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌(వోఆర్‌వోపీ) పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని ప్రధాని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఆ పథకం సక్రమంగా అమలైతే ఈ ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. బాధిత కుటుంబాన్ని తాము కలుస్తామని, అది తమ బాధ్యత అని ఆయన అన్నారు.

 

మరిన్ని వార్తలు