కోవిడ్‌కు అత్యంత చవకైన ట్యాబ్లెట్‌ ఇదే!

21 Jul, 2020 17:05 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా బాధితులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులన్నింటిలో ఫాబిఫ్లూ మెడిసిన్‌ అత్యంత చవకైందని ముంబై కేంద్రంగా పనిచేసే గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్‌ కేంద్రానికి తెలిపింది. భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం మిగతా కోవిడ్‌ మందులతో పోల్చుకుంటే ఫాబిఫ్లూ తక్కు ధర అని గ్లెన్‌మార్క్‌ కేంద్రానికి వివరించింది. ఇతర కోవిడ్‌ మందులు రెమ్డెసివిర్‌, టాసిలీజుమాబ్‌, ఇతోలిజుమాబ్‌ ధరలు ఫాబిఫ్లూ కంటే మూడు నుంచి ఐదు రెట్లు అధికమని కంపెనీ వాదించింది. ఫాబిఫ్లూ ధరలు, దాని పనితీరుపై కొన్ని విమర్శలు రావడంతో కేంద్రం గ్లెన్‌మార్క్‌ను వివరణ కోరగా ఈ మేరకు సదరు ఫార్మాస్యూటికల్‌ స్పందించింది. ఫాబిఫ్లూ ధర సామాన్యులకు సైతం అందుబాటులో ఉందని వివరణ ఇచ్చింది.
(చదవండి: ప్లాస్మా థెరఫీతో కోలుకున్న జైన్‌)

కాగా, గత నెలలో గ్లెన్‌మార్క్‌ కోవిడ్‌ చికిత్సలో పనిచేసే యాంటి వైరల్‌ ఔషదం ఫవిపిరవిర్‌ను ఫాబిఫ్లూ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. రూ.103 కు ఒక ట్యాబ్లెట్‌ చొప్పున ధర నిర్ణయించింది. కోవిడ్‌ నుంచి కోలుకునేందుకు రెండు వారాలపాటు ఈ మెడిసిన్‌ వాడాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే కోర్సు పూర్తయ్యే సరికి రూ.12,500 వ్యయం అవుతుంది. అయితే, ఫవిపిరవిర్‌ శ్వాస సంబంధ వ్యాధులు ఉన్న కోవిడ్‌ బాధితులపై సరిగా పనిచేయడం లేదనే వార్తలు వెలువడ్డాయి. దాంతోపాటు ధరలు కూడా అధికంగా ఉన్నాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో వివరణ ఇవ్వాలని కేంద్రం గ్లెన్‌ మార్క్‌కు నోటీసులు పంపింది. ఇదిలాఉండగా.. గత వారం గ్లెన్‌మార్క్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాబ్లెట్లపై ధరను 27 శాతం ధర తగ్గించింది. దాంతో ఒక్కో ట్యాబ్లెట​ ధర రూ.75 కు చేరింది.
(గ్లెన్‌మార్క్‌ ఫార్మా- జిందాల్‌ స్టీల్‌.. బోర్లా)

మరిన్ని వార్తలు