ఫేస్‌బుక్‌కూ ఆధార్‌!

28 Dec, 2017 02:05 IST|Sakshi

న్యూఢిల్లీ: నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్‌ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్‌ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్‌ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్‌ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్‌ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు.

‘కుటుంబ సభ్యులు, స్నేహితులు సులభంగా గుర్తించేందుకు ప్రజలు ఫేస్‌బుక్‌లో ఆధార్‌ కార్డుల్లో ఉన్న నిజమైన పేర్లను వాడాలని కోరుతున్నాం. ఆధార్‌లోని పేరు ఇవ్వాలన్న ప్రాంప్ట్‌ కేవలం మొబైల్‌ ద్వారా ఫేస్‌బుక్‌ వినియోగించేవారికి కన్పిస్తోంది. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని మేం ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాం’ అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి చెప్పారు.  యూజర్ల పేర్లు తప్ప ఆధార్‌లోని ఎలాంటి వివరాలను అడగటం లేదన్నారు. దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదన్నారు. దాదాపు 125 గ్రామాల్లో ‘ఎక్స్‌ప్రెస్‌ వైఫై’ పేరిట హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ హాట్‌స్పాట్‌లను ఫేస్‌బుక్‌ 2016లో ప్రారంభించింది.

మరిన్ని వార్తలు