ప్రజాసంబంధాలే పాలనకు కీలకం

4 Jul, 2014 04:40 IST|Sakshi
ప్రజాసంబంధాలే పాలనకు కీలకం

* తనను కలిసిన ఫేస్‌బుక్ సీవోవోతో ప్రధాని
* ఫేస్‌బుక్ ద్వారా పర్యాటకులను ఆకర్షించడంపై చర్చ

 
న్యూఢిల్లీ: ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం పరిపాలనలో కీలకాంశమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు, పరిపాలనకు ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వంటి వేదికను పనిముట్టుగా ఉపయోగించుకోవచ్చన్నారు. భారత పర్యటనలో ఉన్న ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) షెరిల్ శాండ్‌బెర్గ్ గురువారం ఢిల్లీలో మోడీతో సమావేశమయ్యారు. భారత్‌లో ఫేస్‌బుక్‌ను మరింత విస్తరించడంపై తన ఆలోచనలను సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించే మోడీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ ఆమెతో మాట్లాడుతూ ప్రజలతో నేరుగా సంబంధాలు కొనసాగించడం పరిపాలనలో ముఖ్యమన్నారు. అనంతరం ఈ భేటీ వివరాలను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దేశంలోకి మరింత మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఫేస్‌బుక్‌ను ఎలా ఉపయోగించాలో షెరిల్‌తో చర్చించానని, ఆమెతో భేటీ ఫలప్రదంగా సాగిందని పేర్కొన్నారు.
 
 మోడీతో భేటీలో ఫేస్‌బుక్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మార్న్ లెవిన్, పబ్లిక్ పాలసీ భారత విభాగం చీఫ్ అంఖీ దాస్ పాల్గొన్నారు. మరోవైపు మోడీతో భేటీ అనంతరం షెరిల్...కమ్యూనికేషన్లు, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. విద్య, ఆరోగ్యం, ఈ-గవర్నెన్స్ తదితర రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై ఈ భేటీలో చర్చించినట్లు విలేకరులతో మాట్లాడుతూ షెరిల్ చెప్పారు. రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ తొమ్మిది భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఫేస్‌బుక్‌లో మరిన్ని భాషలను చేర్చాల్సిందిగా కోరానన్నారు. కాగా, ఫేస్‌బుక్‌లో 1.89 కోట్ల ‘లైక్’లతో అమెరికా అధ్యక్షుడు ఒబామా తర్వాత రెండో స్థానంలో నిలిచిన మోడీ... ట్విట్టర్‌లో 50.90 లక్షల మంది ‘ఫాలోవర్ల’తో ఒబామా, పోప్ తర్వాత మూడో అతిపెద్ద ప్రపంచ నేతగా నిలిచారు.
 
 మోడీతో అమెరికా సెనేటర్ సమావేశం

 అమెరికా సీనియర్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం పునరుత్తేజానికి మోడీతో కలిసి పనిచేయాలన్న బలమైన కోరిక అమెరికాలో వ్యక్తమవుతోందని చెప్పారు. ఇందుకు మోడీ బదులిస్తూ ద్వైపాక్షిక సంబంధాలను నూతన స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానన్నారు. సెప్టెంబర్‌లో అమెరికా పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
 
 మోడీ కాశ్మీర్ పర్యటనకు భారీ భద్రత: ప్రధాని మోడీ శుక్రవారం జమ్మూకాశ్మీర్‌లో తొలిసారి పర్యటిస్తుండటం, ఈ పర్యటనకు నిరసనగా హురియత్ కాన్ఫరెన్స్‌సహా వేర్పాటువాద గ్రూపులన్నీ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలను చేపట్టాయి. ఈ పర్యటన సందర్భంగా మోడీ తొలుత జమ్మూలోని ఉధంపూర్ నుంచి కాత్రా వరకూ కొత్తగా నిర్మించిన 25 కి.మీ. రైలు మార్గంలో ప్రయాణించే తొలి రైలును కాత్రా స్టేషన్‌ను ప్రారంభిస్తారు. వైష్ణోదేవి ఆలయ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఇకపై ఈ రైలు మార్గం ద్వారా నేరుగా కాత్రాలోని బేస్ క్యాంపునకు చేరుకోవచ్చు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా