హ్యాకర్ల గుప్పిట్లో ఎఫ్‌బీ యూజర్ల డేటా

20 Dec, 2019 17:02 IST|Sakshi

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌పై డేటా ఉల్లంఘనలు, వ్యక్తిగత సమాచారం లీక్‌ కావడం వంటి ఆరోపణలు నమోదవుతున్న క్రమంలో తాజాగా కోట్ల మంది వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని కంపెయిర్‌టెక్‌, సెక్యూరిటీ పరిశోధకులు బాబ్‌ దియచెంకో నివేదిక వెల్లడించింది. 26.7 కోట్ల మంది ఎఫ్‌బీ యూజర్ల యూజర్‌ ఐడీలు, పేర్లు, ఫోన్‌ నంబర్ల వంటి వ్యక్తిగత డేటా ఓ డేటాబేస్‌ ఆన్‌లైన్‌లో నిక్షిప్తమైందని, ఈ డేటాబేస్‌ను ఎవరైనా ఆన్‌లైన్‌లో పాస్‌వర్డ్‌ లేకుండా యాక్సెస్‌ కావచ్చని నివేదిక బాంబు పేల్చింది. ఎస్‌ఎంఎస్‌ స్పామ్స్‌, ఫిషింగ్‌ దాడుల కోసం ఈ డేటాను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.

డేటా లీక్‌ గురించి తెలియగానే  డేటాబేస్‌ ఐపీ అడ్రస్‌ల ద్వారా దాన్ని సర్వర్ల నుంచి తొలగించేందుకు ఇంటర్‌నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ను దియచెంకో సంప్రదించారు.  అయితే డేటాబేస్ యాక్సెస్‌ను సర్వీస్‌ ప్రొవైడర్‌ నిరోధించిన రెండు వారాలకు ముందే ఈ డేటాబేస్‌ ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేసింది. దీన్ని ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ఏకంగా ఈ డేటాబేస్‌ను హ్యాకర్‌ ఫోరంలో పోస్ట్‌ చేశారు. కోట్లాది ఎఫ్‌బీ యూజర్ల డేటాబేస్‌ ఎలా సాధ్యమైందనేది వివరిస్తూ ఫేస్‌బుక్‌ ఏపీఐలో భద్రతా లోపాల కారణంగానే హ్యాకర్లు ఈ పనికి పాల్పడి ఉంటారని దియచెంకో అంచనా వేశారు. కాగా తాజా లీక్‌పై ఫేస్‌బుక్‌ స్పందిస్తూ ఈ వ‍్యవహారాన్ని పరిశీలిస్తున్నామని యూజర్ల సమాచారాన్ని కాపాడేందుకు తాము మార్పులు చేపట్టక ముందు ఇది జరిగి ఉండవచ్చని వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు