అందుకే ఆమెను పెళ్లాడాను..

11 Oct, 2019 16:14 IST|Sakshi

కోల్‌కతా : దేశమంతా విజయదశమి వేడుకల్లో మునిగిపోయిన వేళ ఓ యువజంట దుర్గాదేవి ఆశీస్సులతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చాటింగ్‌ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని.. నేరుగా కలిసిన నాలుగు గంటల్లోనే పెళ్లి చేసుకుని తమ బంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. దుర్గామాత సాక్షిగా తమ మధుర క్షణాలను జీవితకాలపు ఆల్బమ్‌లో పదిలపరచుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ నది ఒడ్డున జరిగిన దసరా వేడుకల్లో చోటుచేసుకుంది. హింద్‌ మోటార్‌కు చెందిన సుదీప్‌ ఆప్టిక్‌ లెన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతడికి సియోరాఫులికి చెందిన ప్రతిమతో పరిచయం ఏర్పడింది. జూలై 25న ఫేస్‌బుక్‌లో ఆమెతో చాటింగ్‌ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్న వీరి మధ్య స్నేహబంధం బలపడింది.

ఈ క్రమంలో అక్టోబరు 6న హుగ్లీ నది ఒడ్డున జరుగుతున్న విజయదశమి వేడుకలకు సుదీప్ హాజరయ్యాడు. ప్రతిమ కూడా అక్కడికి దగ్గర్లోనే ఉన్న మరో వేదిక వద్ద ఉందని తెలుసుకుని.. ఒకసారి నేరుగా కలుద్దామని ఆమెను కోరాడు. ఇందుకు ప్రతిమ అంగీకరించడంతో ఓ పూజా మండపంలో తొలిసారి కలుసుకున్నారు. చూపులు కలిసిన శుభవేళే సుముహూర్తం అన్నట్లుగా ప్రతిమను చూసిన నాలుగు గంటల్లోనే సుదీప్‌ ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్‌ చేయగా... మౌనమే ఆమె అంగీకారమైంది. ఇక అక్కడే ఉన్న భక్తులు, ప్రతిమ-సుదీప్‌ల స్నేహితులు హర్షధ్వానాలతో వారిని ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో సుదీప్.. ప్రతిమ నుదుటన సింధూరం దిద్ది పెళ్లి ప్రమాణాలు చేశాడు. ఇరువురు పూలదండలు మార్చుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. 

ఈ విషయం గురించి సుదీప్‌ మాట్లాడుతూ..‘ ముందు మేమిద్దరం మంచి స్నేహితులం. తర్వాత తనతో ఎప్పుడు ప్రేమలో పడ్డానో తెలీదు. ప్రతిమ నా పేరిట సింధూరం ధరించాలని భావించింది. ముహుర్తాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. అందుకే తనను పెళ్లాడాను అని చెప్పుకొచ్చాడు. ఇక సుదీప్‌లోని అమాయకత్వం, దయాగుణమే తనను ఆకర్షించిందని.. అందుకే తన మాట కాదనలేకపోయానని చెబుతూ సిగ్గులమొగ్గయింది. ఈ పెళ్లిని తన తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా ప్రస్తుతం తమ బంధాన్ని అంగీకరించారని హర్షం వ్యక్తం చేసింది. అత్తగారు కూడా తనను చూసి చాలా సంతోషపడ్డారని.. సుదీప్‌తో తన పెళ్లి జరగడంతో వారింట ఆనందాలు వెల్లివిరిశాయని పేర్కొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా