సైకిల్ గ‌ర్ల్‌పై అత్యాచారం, హ‌త్య‌: నిజ‌మెంత‌?

5 Jul, 2020 16:18 IST|Sakshi

పాట్నా: నిజం గ‌డ‌ప దాటేలోపు అబ‌ద్ధం ఊరు చుట్టొస్తుందని ఊరికే అన‌లేదు. పనీపాటా లేని చాలామంది లేనిపోని వ‌దంతులు సృష్టిస్తూ.. దానికి సోష‌ల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఇది త‌ప్పు అని చెప్పేలోపే అది దేశమంతా పాకిపోతోంది. కొన్నిసార్లైతే అది అబ‌ద్ధమంటూ కుండ బ‌ద్ధ‌లు కొడుతూ అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెట్టినా జ‌నాలు వినే స్థితిలో లేరు. ఇప్ప‌టివ‌ర‌కు న‌టీన‌టుల‌కు, రాజ‌కీయ నాయ‌కులకు లేని క‌రోనాను అంటిస్తూ, కొంద‌రైతే ఏకంగా మ‌ర‌ణించిన‌ట్లు అస‌త్య‌ వార్తలు ప్ర‌చారం కావ‌డాన్ని చూశాం. ఇప్పుడు ఓ దారుణ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. లాక్‌డౌన్‌లో గాయ‌ప‌డ్డ త‌న తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కి.మీ ప్ర‌యాణించిన బిహార్ బాలిక జ్యోతి కుమారి అత్యాచారానికి గురైందంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు క‌నిపిస్తున్నాయి. (బార్‌కోడ్‌తో చైనా వ‌స్తువును గుర్తించొచ్చా?)

ఆమె స్వ‌స్థ‌ల‌మైన బిహార్‌లోని ద‌ర్భంగాలో మాజీ సైనికుడి చేతిలో ఆ బాలిక దారుణంగా అత్యాచారానికి గుర‌వ‌డ‌మే కాక అత‌ని చేతిలో ప్రాణాలు కోల్పోయింద‌ని స‌ద‌రు న‌కిలీ పోస్టుల సారాంశం. అంతేకాకుండా  చెట్ల పొద‌ల్లో నిర్జీవంగా ప‌డి ఉన్న ఓ బాలిక‌ ఫొటోల‌ను ఈ పోస్టుల‌కు జ‌త చేస్తున్నారు. నిజ‌మేంటంటే.. ద‌ర్భంగాలో ప‌ద‌మూడేళ్ల‌ బాలిక విద్యుదాఘాతానికి గురై మ‌ర‌ణించింది. ఆమె మృతదేహం మాజీ సైనికుడి ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప‌డి ఉండ‌టంతో అనుమానించిన పోలీసులు అత‌డిని, అత‌డి భార్య‌ను అరెస్ట్ చేశారు. ఇక్క‌డ మ‌ర‌ణించిన బాలికకు సైకిల్ గ‌ర్ల్ జ్యోతికుమారికి ఎలాంటి సంబంధం లేదు. అయితే మ‌ర‌ణించిన బాలిక పేరు కూడా జ్యోతి కుమారి అని ఉండ‌ట‌మే ఈ గంద‌ర‌గోళానికి తావిచ్చింది. (సైక్లింగ్‌ తెచ్చిన అవకాశాలు..)

ముగింపు:  సైకిల్ గ‌ర్ల్‌పై ఎలాంటి అత్యాచారం, హ‌త్య జ‌ర‌గ‌లేదు.

మరిన్ని వార్తలు