ఐఐటీల్లో 34 శాతం అధ్యాపకుల కొరత

1 Apr, 2018 08:14 IST|Sakshi

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ).. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.  ఏడాదికేడాది ఆ సంస్థల్ని విస్తరిస్తూ పోతున్న కేంద్ర ప్రభుత్వం అందులో అధ్యాపకుల నియామకంపై దృష్టి పెడుతున్నట్టుగా లేదు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉంటే అన్ని సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య అధ్యాపకుల కొరత.  అన్ని సంస్థల్లో కలిపి మొత్తంగా చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 34 శాతం అధ్యాపకుల కొరత పట్టిపీడిస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థులకు పాఠం చెప్పేవాళ్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పాలక్కడ్, తిరుపతి, గోవా వంటి కొత్తగా ఏర్పాటైన ఐఐటీల్లోనే కాదు ఎంతో ఘనతవహించిన ముంబై, ఖరగపూర్, కాన్పూర్‌ వంటి సంస్థల్లోనూ ఇదే దుస్థితి. ఎప్పట్నుంచో ఉన్న ఈ పాత సంస్థల్లోనే అధ్యాపకుల కొరత 25 శాతం నుంచి 45శాతం వరకు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

ఏ ఐఐటీలో అధ్యాపకుల కొరత ఎంత?

  • ఐఐటీ–గోవా             62 %
  • ఐఐటీ–భిలాయ్‌        58  %
  • ఐఐటీ–ధర్వాడ్‌         47 %
  • ఐఐటీ–ఖర్గపూర్‌       46  %
  • ఐఐటీ–కాన్పూర్‌       37  %
  • ఐఐటీ–ఢిల్లీ              29  %
  • ఐఐటీ–చెన్నై           28  %
  • ఐఐటీ–ముంబై         27  %

ఎందుకీ పరిస్థితి ?
ఐఐటీల్లో ఫాకల్టీ కొరత కొత్త సమస్యేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుల కొరత, సదుపాయాల లేమితో ఐఐటీల ప్రతిష్ట మసకబారుతోంది. ఐఐటీల్లో డిగ్రీలు తీసుకుంటున్న వారు మల్టీ నేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లిపోతున్నారే తప్ప, తిరిగి ఆ సంస్థల్లో ఫాకల్టీగా చేరుదామని అనుకోవడం లేదు. ఒకప్పుడు ఐఐటీలో విద్యాభ్యాసం చేసినవారిలో 15 శాతం మంది అదే సంస్థల్లో అధ్యాపకులగా చేరేవారు. కానీ ఇప్పుడది గణనీయంగా తగ్గిపోయింది. ఐఐటీ విద్యార్థుల్లో 50శాతం మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిపోతూ ఉంటే మిగిలిన వారిలో అత్యధిక శాతం భారత్‌లోని ప్రైవేటు కంపెనీల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు.

అధ్యాపక వృత్తి పట్ల యువతరంలో ఆకర్షణ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రప్రభుత్వం అందులో మౌలిక సదుపాయాలపై మాత్రం దృష్టి సారించడంలేదు. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఐఐటీలను మంజూరు చేస్తూ ఉండడంతో బోధనా నైపుణ్యం కలిగిన అధ్యాపకులెవరూ అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ‘కర్ణాటకలోని ధర్వాడ్‌ వంటి పట్టణాల్లో సదుపాయాలే ఉండవు. పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైనవి లేని పట్టణాలకు నైపుణ్యం కలిగిన బోధకులు ఎందుకు వస్తారు’  అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం ఏం చేయాలి ?
ఐఐటీల్లో అధ్యాపకుల కొరత అధిగమించడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీలో ఒక నియామకం జరగాలంటే ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ఐఐటీల సంఖ్యమాత్రమే పెంచితే సరిపోదు. అధ్యాపకుల్ని ఆకర్షించేలా వేతనాలు పెంచడం, గ్యాడ్యుయేషన్‌తో చదువు ఆపేయకుండా విద్యార్థులు పీహెచ్‌డీ చేసేలా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ కొరతని అధిగమించగలం’ అని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐటీల్లోకి ఫారెన్‌ ఫాకల్టీని కూడా తీసుకురావడానికి వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు పదవీవిరమణ చేసిన అధ్యాపకుల్ని తిరిగి తీసుకోవడం, ఉన్నవారికి మరి కొన్నేళ్లు పదవీకాలం పొడిగింపు  వంటి చర్యలు కూడా తీసుకోనుంది. ఏదిఏమైనా  ఐఐటీల ప్రతిష్ట మరింత మసకబారకుండా కేంద్రమే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

-- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు