సీఎం ఫడ్నవిస్‌కు అంత సీన్ లేదు..

4 Nov, 2014 23:16 IST|Sakshi
సీఎం ఫడ్నవిస్‌కు అంత సీన్ లేదు..

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగతంగా మంచివాడే అయినా, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం, అనుభవం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మొదటిసారి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఖడ్సే మినహా సమర్థులైన ఒక్కరూ లేరన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సామర్థ్యం ఫడ్నవిస్ నాయకత్వంలోని మంత్రివర్గానికి లేదని వ్యాఖ్యానించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ప్రచార కమిటీ చైర్మన్‌గా తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తిస్తారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని పేర్కొన్న ఫడ్నవిస్ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మాటమార్చారని దుయ్యబట్టారు. ఒకవేళ ఆయన ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం శివసేన పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో అఫ్జల్ ఖాన్ సేన అంటూ బీజేపీని ఎద్దేవా చేసిన ఉద్ధవ్ ఇప్పుడు అధికారం కోసం ఆదే సేనలో చేరాలని ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో బాల్ ఠాక్రే ఉంటే అధికారాన్ని లాగి తన్నేవారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెన్నెస్, ఎంఐఎం పార్టీలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు