ఫెయిలైన వారికి సీబీఎస్‌ఈ మరో చాన్స్‌

15 May, 2020 06:31 IST|Sakshi

న్యూఢిల్లీ: పాఠశాల స్థాయి 9, 11వ తరగతుల పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) తెలిపింది. ‘విద్యార్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలకు హాజరుకావచ్చు. కోవిడ్‌ సంక్షోభం దృష్ట్యా ప్రస్తుత సంవత్సరానికి మాత్రమే వర్తించేలా, విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను మెరుగు పరుచుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం.’ అని గురువారం సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఇప్పటికే పరీక్షలు రాసిన, ఫలితాలు వెలువడిన, ఇప్పటి వరకు పరీక్షలు రాయని, అన్ని సబ్జెక్టుల వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ తెలిపారు.

ఈ పరీక్షలో ఫలితాల ప్రాతిపదికన విద్యార్థులను పై తరగతులకు పంపవచ్చని పాఠశాలల యాజమాన్యాలకు తెలిపారు. పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేలా విద్యార్థులకు తగిన విధంగా సమయం ఇవ్వాలన్నారు. వాయిదాపడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలను జూలై ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే బోర్డు ప్రకటించింది. ప్రతిభతో సంబంధం లేకుండా 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు గత నెలలో సీబీఎస్‌ఈ ప్రకటించడం తెల్సిందే. ‘పరీక్షలు సరిగా రాయలేకపోయిన విద్యార్థులు మరింత నిరుత్సాహానికి గురవడం సహజం. అందుకే, వారి ఆందోళనను పోగొట్టి, మానసిక స్థైర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని భరద్వాజ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు