దొంగ లెక్కలు ఎలా ఉంటాయంటే..!

12 Jan, 2019 19:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ద్వారా కేంద్రానికి ఏటా వేలాది కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఉన్నతాధికారులు ఊకదంపుడుగా ఊదరకొట్టడం మనం వినే ఉంటాం. అంతెందుకు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఏటా ప్రభుత్వానికి 77 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని పదే పదే  చెప్పడమే కాకుండా, ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రపంచ బ్యాంకు తన ‘2016 వార్షిక నివేదిక’లోనే ధ్రువీకరించిందని చెప్పారు. అంతేకాకుండా ఆధార్‌ కార్డుల రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినప్పుడు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఈ ‘ప్రపంచ బ్యాంకు లెక్కల’ను పేర్కొన్నారు.

ఈ లెక్కలు నిజమేనా? ఆధార్‌ కార్డుల ద్వారా ఏటా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ మేరకు దుర్వినియోగాన్ని అరికట్ట గలిగారో, ఆర్థికంగా దాని విలువెంతో మన ఆర్థికవేత్తలకే ఇంతవరకు అంతు చిక్కడం లేదు. అలాంటప్పుడు ప్రపంచ బ్యాంకు అంత కచ్చితంగా ఎలా లెక్కకట్టింది? దానికి ఆ లెక్కలు ఎవరు చెప్పారు? ఈ సందేహం ఎవరికైనా వచ్చిందా? సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకుడు ఆనంద్‌ వెంకట నారాయణన్‌కు ముందుగా వచ్చింది. ఆయన భారత పొదుపు మీద ‘2016 ప్రపంచ బ్యాంకు నివేదిక’ను రూపొందించిన అధికారులకు ‘ఈ 77 వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఎలా లెక్కించారు?’ అంటూ 2017, సెప్టెంబర్‌లో ఈమెయిల్‌ ద్వారా ఓ లేఖ రాశారు. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

2018, ఫిబ్రవరి 9వ తేదీన ఆ ప్రశ్నకు మరిన్ని అనుబంధ ప్రశ్నలను జోడించి వెంకట నారాయణన్‌ మళ్లీ ఈ మెయిల్‌ పంపించారు. ఈసారి బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది. అయితే అందులో అధికారుల పేర్లను పేర్కొనలేదు. ‘ మొట్టమొదటి అంశం 11 బిలియన్‌ డాలర్లు (దాదాపు 77 వేల కోట్ల రూపాయలు) వాస్తవ లెక్క కాదు. అంత మిగిలే అవకాశం ఉందన్న అంచనా. రెండోది ఇది ప్రపంచ బ్యాంకు సిబ్బంది వేసిన అంచనా కాదు. విద్యావేత్తలు, ఆర్థిక వేత్తలు వేసిన అంచనా. మూడవది భారత ప్రభుత్వం 11 బిలియన్‌ డాలర్ల దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ప్రపంచ బ్యాంకు ఆకాంక్ష. నివేదిక పీఠికలో ఇది ఒక అంచనా అన్నది సూచించాం’ అని ప్రపంచ బ్యాంకు సమాధానం ఇచ్చింది. ఆ మరుసటి రోజే వెంకట నారాయణన్‌ మరో అనుబంధ పశ్నను పంపించారు. ప్రపంచ బ్యాంకు సీనియర్‌ అధికారులు.. ఆధార్‌ మంచి పథకం, దాని వల్ల కోట్లాది రూపాయలు మిగులుతున్నాయని ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఆ ప్రశ్న. దానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి సమాధానం వచ్చింది.

అందులో ‘ ఆధార్‌ లాంటి డిజిటల్‌ గుర్తింపు వ్యవస్థ ప్రయోజనాల గురించి ప్రపంచ బ్యాంకు సీనియర్‌ అధికారులు మాట్లాడడం సహజమే. ఏ దేశంలోనైనా అభివృద్ధి ప్రక్రియ సమ్మిళితంగా, సమర్థంగా జరగాలి. అభినందించడమనేది లేకపోవడం వల్ల అది జరగడం లేదు. అభినందనల వల్ల జవాబుదారీ ప్రభుత్వమే కాకుండా సంస్థలు కూడా సానుకూలంగా స్పందిస్తాయన్నది మా విశ్వాసం’ అని పేర్కొంది. ఇది తమ దేశంలో గందరగోళానికి దారితీసిందని, 77 వేల కోట్ల ఆదా అన్నది వాస్తవం కాదని, అది ఒక అంచనా అంటూ ఓ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా వెంకట నారాయణన్‌ ఎన్నిసార్లు ప్రపంచ బ్యాంకు అధికారులను కోరినా ‘త్వరలో విడుదల చేస్తాం’ అన్న వ్యాక్యం తప్పిస్తే ఇంతవరకు ప్రకటన వెలువడలేదు. ఆయన ఇటీవల కూడా ప్రపంచ బ్యాంకు అధికారులను సంప్రతించగా, ఢిల్లీలోని ప్రపంచ అధికారులను సంప్రతించాల్సిందిగా సూచించారట. ప్రస్తుతం ఆయన ఆ పనిలో ఉన్నారు.

77 వేల కోట్ల రూపాయలు కేవలం అంచనా అన్నది అలహాబాద్‌ ఐఐఎం అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త రీతికా ఖెరా 2016, జూలై 21వ తేదీన ఎన్‌డీటీవీ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో కూడా ఉంది. 77 వేల కోట్ల రూపాయల అంచనా కూడా తప్పేనని బెల్జియంలో పుట్టి ఢిల్లీలోని ‘ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇనిస్టిట్యూట్‌’ పీహెచ్‌డీ చేసి భారత్‌లోని పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తూ.. ప్రముఖ ఆర్థికవేత అమర్త్యసేన్‌కు సహా రచయితగా ఉంటున్న జాన్‌ డ్రెచ్‌ తేల్చారు.

ఆధార్‌ కార్డు ప్రయోజనాలను పక్కన పెడితే ఆధార్‌ కార్డు లేకపోవడం వల్ల, వేలిముద్రలు గుర్తించని సాంకేతిక లోపం కారణంగా రేషన్‌ కార్డులు అందక మరణించిన వారు.. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 30 మంది. ఒక్క జార్ఖండ్‌లోనే 14 మంది మరణించగా, ఢిల్లీలో పదేళ్లలోపు ముగ్గురు అక్కాచెల్లెళ్లు మరణించడం విషాదకరం.

>
మరిన్ని వార్తలు