వామ్మో.. వాట్సాప్‌ వార్త!

4 Jul, 2018 01:27 IST|Sakshi

వదంతులతో అమాయకుల ప్రాణాలు బలి

సవాల్‌గా ‘ఫేక్‌ న్యూస్‌’

న్యూఢిల్లీ: పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్‌ అక్కడ తిరుగుతోంది..జాగ్రత్త! దోపిడీ దొంగలు ఈ ప్రాంతంలోనే ఉన్నారు! అక్కడెక్కడో ఎవరో గోమాంసం తింటున్నారు! ఫలానా ఏరియాలో పగలే దొంగతనాలు జరుగుతున్నాయ్‌! .. వాట్సాప్‌లో వస్తున్న ఇలాంటి సమాచారంలో నిజమెంత అనే విషయాన్ని జనం ఆలోచించడం లేదు. అనుమానాస్పదంగా కనిపించిన వారు, పరాయి భాషలో మాట్లాడే వారు, చిన్న పిల్లలతో కలిసి కనిపించిన అపరిచితులపై దాడి చేసి చంపేస్తున్నారు. పుకార్లు, నకిలీ వార్తల్ని నమ్మొద్దంటూ పోలీసులు చేస్తున్న ప్రచారం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు.

చిన్న పిల్లలను ఎత్తుకుపోయే ముఠా తిరుగుతోందన్న వాట్సాప్‌ నకిలీ వార్త ఒక్కటి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 11 రాష్ట్రాల్లో ఏడాది కాలంలో సుమారు 27 మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని ధూలే జిల్లా రెయిన్‌పడ గ్రామంలో అయిదుగురు వ్యక్తుల్ని చిన్నపిల్లల కిడ్నాపర్లనే అనుమానంతో గ్రామస్తులు కొట్టి చంపారు. గత రెండు నెలల్లో ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన మొత్తం 13 ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలు, పొట్ట చేత పట్టుకొని వచ్చిన వలస కూలీలే.
 
అడ్డుకోవడం సాధ్యమేనా?  
గత నెలలో హైదరాబాద్‌లోని బీబీనగర్‌లో ఆటోడ్రైవర్‌ బాలకృష్ణను కిడ్నాపర్‌ అన్న అనుమానంతో గ్రామస్తులు కొట్టి చంపిన ఘటనతో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. కానీ, వాట్సాప్‌లో ఇలాంటి నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడం కష్టమేనని తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు అంటున్నారు.

ఎందుకంటే వాట్సాప్‌లో వినియోగదారుల సమాచారం  భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ అన్న ఆప్షన్‌ ఇప్పుడు నకిలీ వార్తలు ఎక్కడ నుంచి మొదలయ్యాయో కనుగొనడానికి అడ్డంకి అయింది. వాట్సాప్‌ సర్వర్‌ కూడా ఇండియాలో లేకపోవడంతో నకిలీ వార్తలు ఎక్కడ్నుంచి వ్యాప్తి చెందుతున్నాయో తెలుసుకోవడం అసాధ్యంగా మారిందని కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా వాట్సాప్‌ను వినియోగిస్తూ, ప్రతీ నెలా 200 కోట్ల జీబీలకు పైగా సమాచారాన్ని షేర్‌ చేస్తుంటారని అంచనా. అంత సమాచారంలో నకిలీ వార్తల్ని పసిగట్టడం పోలీసులకు శక్తికి మించిన పని. గతవారం వాట్సాప్‌ గ్రూపుల్లో సభ్యులు ఇష్టారాజ్యంగా మెసేజ్‌లు పంపకుం డా అడ్మిన్లు నియంత్రించే ఫీచర్‌ ప్రవేశపెట్టడం తో మెసేజ్‌లకు కొంతయినా అడ్డుకట్ట పడే అవకాశం ఉందంటున్నారు.


వాట్సాప్‌కు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: విద్వేషపూరిత, రెచ్చగొట్టే సందేశాల వ్యాప్తికి సంబంధించి కేంద్రం మెసే జింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను హెచ్చరించింది. అలాంటి వాటిని నిరోధించడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వాట్సాప్‌ పోస్టుల ప్రేరణతో ఇటీవల అమాయకులపై దాడులు పెరిగాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మంగళవారం వాట్సాప్‌కు లేఖ రాసింది. జవాబుదారీతనం, బాధ్యతల నుంచి ఆ సంస్థ తప్పించుకోజాలదని అందులో పేర్కొంది. అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో వదంతులతో వ్యక్తులపై దాడిచేసి చంపడం దురదృష్టకరమని తెలిపింది. వాట్సాప్‌ లాంటి వేదికలు దుర్వినియోగ కావడంపై ఆందో ళన వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ప్రేరేపించే సందేశాలను విస్తరింపజేయకుండా చూడాలని కోరింది. 

>
మరిన్ని వార్తలు