అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’

9 Jan, 2020 17:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పాకిస్థాన్‌లో నేడు హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరాలకు తార్కాణం ఈ వీడియో. ఓ హిందూ యువతిని ఆమె కన్న తల్లి ముందే బలవంతంగా ఇద్దరు ముస్లిం యువకులు ఎత్తుకు పోయారు. అడ్డు వచ్చిన తల్లిని చితకబాదారు. ఇప్పటికైనా  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తున్న ప్రజలు కళ్లు తెరవాలి. పాకిస్తాన్‌లో 1951లో అక్కడి జనాభాలో హిందువులు 12.9 శాతం  ఉండగా, నేడు 1.6 శాతం మాత్రమే ఉన్నారు’ అన్న వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

అదే వీడియో 2019, డిసెంబర్‌ నెలలో కూడా మరో వ్యాఖ్యానంతో వైరల్‌ అయింది. రాజస్థాన్‌లో అందరి ముందే ఓ పేద యువతిని ఎత్తుకుపోయి గ్యాంగ్‌ రేప్‌ చేశారన్నది నాటి వ్యాఖ్యానం. వాస్తవానికి రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ జిల్లాలో నిజంగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో అది. కలు ఖాన్‌ కీ ధని గ్రామానికి చెందిన నేమత్, అహ్మద్‌ ఖాన్‌ దంపతుల కూతురుతో షౌకత్‌ అనే యువకుడికి చిన్నప్పుడే పెళ్లయింది. అమ్మాయిని తమ ఇంటికి పంపించాల్సిందిగా షౌకత్‌ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచే గొడవ చేస్తున్నప్పటికీ కూతురికి 18 ఏళ్లు వచ్చాకే పంపిస్తానంటూ తల్లి నేమత్‌ చెబుతూ వచ్చింది. 2017, సెప్టెంబర్‌ నెలలో షౌకత్‌ తన మిత్రుడు ఖాసింతో కలిసి ట్రాక్టర్‌పై వచ్చి తన మైనర్‌ భార్యను ఎత్తుకుపోయాడు. పోలీసుల కథనం మేరకు ఈ వార్త ‘దైనిక్‌ భాస్కర్‌’ పత్రికలో 2017, సెప్టెంబర్‌ 27వ తేదీన ప్రచురితమైంది.

ఈ వీడియో నకిలీదని తెలుసుకోవడానికి ఇదంతా కూడా తెలుసుకోనక్కర్లేదు. ఆ బాలిక, ఆమె తల్లి వేషాధారణ, భాషనుబట్టి వారు ముస్లింలని స్పష్టంగా తెలిసిపోతుంది. వారిద్దరు హిందువులంటే ఎలా నమ్ముతారో! పైగా పాకిస్థాన్‌కు సంబంధించి హిందువుల సంఖ్యను తప్పుగా పేర్కొన్నారు. పాక్‌లోని హిందూ కౌన్సిల్‌ ప్రకారం ప్రస్తుతం అక్కడ 85 లక్షల మంది హిందువులు ఉన్నారు. దేశ విభజన అనంతరం అక్కడి నుంచి దాదాపు 47 లక్షల మంది హిందువులు భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు.

మరిన్ని వార్తలు