సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫేక్‌ వీడియో

1 Mar, 2019 18:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్ భార్య పేరుతో గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఫేక్‌ అని తేలింది. ‘‘నేను పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న అభినందన్‌ భార్యని. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను రాజకీయ నాయకులు సొంతం లాభం కోసం వాడుకోకండి. సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకోకండి’’ అంటూ 1.08 నిమిషాల పాటు సాగే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వీడియో వైరల్‌ అవ్వడంతో బూమ్‌ లైవ్‌ అనే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ఏజన్సీ దానిని గుర్తించి.. అది ఫేక్‌ వీడియో అని తేల్చింది.

ఆ వీడియోలో మాట్లాడుతున్నది హర్యానా రాష్టంలోని గుర్గావ్‌కు చెందిన శిరీష రావ్‌గా గుర్తించింది. బూమ్‌ ఏజన్సీ ఆమెను సంప్రదించగా.. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది తానేని శిరీషరావ్‌ తెలిపారు. తనకు తెలియకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానిని మార్ఫింగ్‌ చేశారనీ, తన భర్త ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి అని పేర్కొన్నారు. సైనికుల త్యాగాలను బీజేపీ నేతలు వారి సొంత రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనీ  వీడియో విమర్శించారు. అయితే ఆమె ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన సామాజిక కార్యకర్త అని తెలిసింది.

మార్ఫింగ్‌ చేసి వీడియోను యూత్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన యువ దేశ్‌ అనే ట్విటర్ ఖాతానుంచి షేర్‌ చేశారు. కాగా సర్జికల్‌ స్ట్రైక్స్‌-2కు సంబంధించిన ఫేక్‌ వీడియో కూడా ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇది తాలిబన్‌ ఉగ్రవాదులను టార్గెట్‌ చేస్తూ 2015లో తయారైన ‘ఆర్మా-2’ అనే వీడియో గేమ్‌ అని బూమ్‌ లైవ్‌ అనే ఫ్యాక్ట్‌ చెకింగ్‌ ఏజన్సీ గుర్తించింది.

సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 ఫేక్‌ వీడియో

మరిన్ని వార్తలు