మాజీ రాష్ట్రపతి బంధువులకు లభించని పౌరసత్వం

31 Jul, 2018 11:33 IST|Sakshi
అస్సాంలోని ఓ సేవ కేంద్రం ముందు వేచివున్న జనం

గువాహటి : అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు(ఎన్నార్సీ) తుది ముసాయిదాను కేంద్రం సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో 40 లక్షల మందికి ఆ జాబితాలో చోటు లభించలేదు. దీనిపై ప్రతిపక్షాలతో పాటు, సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నార్సీ ముసాయిదా నుంచి 40 లక్షల మందిని తప్పించడంపై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘సొంతగడ్డపై భారతీయులే శరణార్థులయ్యారు’ అని పేర్కొన్నారు. బీజేపీ విభజించు పాలించు సిద్దాంతాన్ని పాటిస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఇలా వ్యవహరిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మాజీ రాష్ట్రపతి బంధువులకు దక్కని చోటు..
సోమవారం విడుదల చేసిన పౌరసత్వ జాబితాలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ బంధువులకు చోటు లభించలేదు.  ఆయన సోదరుడు ఇక్రాముద్దీన్‌ అలీ కుమారుడు జియాద్దీన్‌ కుటుంబ సభ్యుల పేర్లు జాబితాలో లేవు. అస్సాంలోని కామ్‌రూప్‌ జిల్లాలోని రాంగియాకు చెందిన జియాద్దీన్‌ కుటుంబానికి పౌరసత్వ జాబితాలో చోటు లభించకపోవడంపై వారిలో ఆందోళన నెలకొంది. జియాద్దీన్‌ మాట్లాడుతూ.. ‘నేను ఫక్రుద్దీన్‌ అలీ బంధువును.. మా కుటుంబ సభ్యుల పేరు ఎన్నార్సీ ప్రకటించిన జాబితాలో లేకపోవడంతో ఆశ్చర్యపోయాం.  మాకు చిన్నపాటి ఆందోళన ఉంద’ని తెలిపారు. కాగా, భారత ఐదవ రాష్ట్రపతిగా సేవలందించిన ఫక్రుద్దీన్‌ పదవిలో ఉన్నప్పుడే మరణించిన సంగతి తెలిసిందే.

మరోవైపు భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ శైలేశ్‌ మాత్రం జబితాలో పేరు లేని వారు తమ అభ్యర్థనను లేఖ ద్వారా సమర్పించవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగిందన్నారు. ఇది తుది జాబితా కాదని పేర్కొన్నారు. బాధితుల్లో చాలా మంది తమ దగ్గర అన్ని రకాల పత్రాలు ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి బంధువులకు కూడా ఈ జాబితాలో చోటు లభించకపోవడం ప్రతిపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు