దుబే హతం: ‘ఇప్పుడు ప్రశాంతంగా ఉంది’

11 Jul, 2020 14:02 IST|Sakshi
వికాస్‌ దుబే (ఫైల్‌)

దుబే ఎన్‌కౌంటర్‌పై చనిపోయిన పోలీసు కుటుంబాల స్పందన

కాన్పూర్‌: ఎన్నో నేరాలకు పాల్పడటమే కాక ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేని శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉందని తెలిపారు. వికాస్‌ దుబే చేతిలో హత్యకు గురయిన జితేందర్‌ పాల్‌ సింగ్‌ తండ్రి తీర్థ్‌ పాల్‌ మీడియాతో మాట్లాడారు. కొడుకు పోయిన బాధలో ఉన్న తనకు దూబే ఎన్‌కౌంటర్‌ వార్త కాస్తా ఊరటనిచ్చింది అన్నారు. ‘ఉత్తరప్రదేశ్‌ పోలీసులను చూస్తే.. చాలా గర్వంగా ఉంది. వారు చేసిన పనులు నాకు కాస్తా ఓదార్పునిచ్చాయి. యోగి ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అ‍న్నారు. (రిపోర్టర్లపై దుబే భార్య ఆగ్రహం)

మరణించిన ఎస్సై నెబ్యులాల్‌ బింద్‌ తండ్రి కలికా ప్రసాద్‌ బింద్‌ మాట్లాడుతూ.. ‘వికాస్‌ దుబేని హతమార్చారనే వార్త నాకు చాలా సంతోషం కలిగించింది. ఇకపోతే వికాస్‌ దుబేకి సాయం చేసిన డిపార్టుమెంట్‌ వ్యక్తులకు కూడా కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మరణించిన సుల్తాన్‌ సింగ్‌ భార్య షర్మిలా వర్మ దుబే మృతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉంది. కానీ అతడి వెనక ఉన్న వారి గురించి మనకు ఎలా తెలుస్తుంది’ అన్నారు.(ఒక్కసారిగా కుప్పకూలిన నేర సామ్రాజ్యం!)

ఉజ్జయిన్‌లో పోలీసుల చేతికి చిక్కిన వికాస్‌ దుబేను కాన్పూర్‌ తీసుకువస్తుండగా పోలీసుల వాహనం రోడ్డు మీద బోల్తా పడింది. ఇదే అదునుగా భావించి వికాస్‌ దుబే పోలీసులను గాయపర్చి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు