కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్!

5 Aug, 2016 08:56 IST|Sakshi
కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్!

ఆగ్రా: స్వల్ప వ్యవధిలోనే కోతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా వాసులకు సమస్యగా మారింది. పట్టణంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న దేవాలయాలు, భక్తుల ఉదార స్వభావం కోతుల పాలిట వరంగా మారింది. ఇప్పటికే పట్టణంలో సుమారు 8,000 కోతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని అలాగే వదిలేస్తే రానున్న ఆరేళ్లలో వీటి సంఖ్య 2.16 లక్షలకు చేరుతుందని అంచనా వేసిన.. అధికారులు, వైల్డ్ లైఫ్ ఎన్జీవోలు కోతుల్లో ఫ్యామిలీ ప్లానింగ్(కుటుంబ నియంత్రణ) అమలు చేయాలని నిర్ణయించారు.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 317 కోతుల్లో వ్యాక్సిన్ల ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ను అమలు చేశారు. దీని ద్వారా రానున్న ఆరేళ్లలో 7,200 కోతుల సంఖ్య పెరగకుండా నిర్మూలించినట్లు వైల్డ్ లైఫ్ ఎన్జీవో 'ఎస్ఓఎస్' సహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ వెల్లడించారు. అయితే మరికొన్ని కోతుల్లో సైతం ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. రీసస్ మకాక్స్ సంతతికి చెందిన ఈ కోతుల్లో.. ప్రతీ ఆడకోతి 18 నెలలకు ఒకసారి మూడు పిల్లలకు జన్మనిస్తుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు