అమర జవాన్‌ కుటుంబం సంచలన వ్యాఖ్యలు 

16 Feb, 2019 11:29 IST|Sakshi

మోదీ సర్కార్‌ మీద మాకు నమ్మకం లేదు- జవాన్‌ భార్య

జవాన్ల త్యాగాలను ప్రభుత్వం గౌరవించడంలేదు- జవాన్‌ తండ్రి

ఉగ్రవాదాన్ని శాశ‍్వతంగా  మట్టుబెట్టాలి- జవాన్‌ సోదరుడు

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ఆయన మాటలను, ప్రభుత్వాన్ని నమ్మలేమంటూ ప్రదీప్‌ సింగ్‌ భార్య నీరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా కాశ్మీర్లో తీవ్రవాద దాడులు జరిగాయి. అయినా భద్రతా దళాలకు సంపూర్ణ స్వేచ్ఛను ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు. అదే ఈ మారణహోమానికి దారితీసిందన్నారు. ఇటీవల 40 రోజులు సెలవు మీద ఇంటికి వ​చ్చిన తన భర్త ప్రదీప్‌ ఫిబ్రవరి 11న కశ్మీర్ వెళ్లారనీ, కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు తరలిపోతారని అనుకోలేదంటూ ఉగ్రదాడి విషాదంలో మునిగిపోయిన నీరాజ్‌  కన్నీటి పర్యంతమయ్యారు.   

జవాన్ల త్యాగాలను ప్రభుత్వం ఎన్నడూ గౌరవించలేదని ప్రదీప్‌ సింగ్‌ తండ్రి, రిటైర్డ్‌ ఎస్‌ఐ, అమర్ సింగ్, ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి త్యాగాన్ని ప్రజలు మరో మూడు రోజుల్లో మర్చిపోతారు .ఎవరి సొంత పనుల్లో వారు బిజీ అయిపోతారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి ప్రభుత‍్వం గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ టెర్రరిస్టుల భీభత్స దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా నిలబడి, దేశంలో పనిచేస్తున్న  ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా  గట్టిగా నిలబడటం ప్రస్తుత తరుణంలో చాలా ముఖ్యమన్నారు.   

తన కుమారుడు చిన్నతనం నుంచి దేశ  సేవ చేయాలని కోరుకున్నాడు. కానీ అతని కోరిక ఇలా తమకు శాశ్వతంగా దూరం చేస్తుందని అనుకోలేదంటూ తల్లి సరోజని దేవి బావురుమన్నారు.  అటు ప్రదీప్‌ సింగ్‌ సోదరుడు కుల్‌దీప్‌ మాట్లాడుతూ, తన సోదరుడి ప్రాణాలు కంటే ప్రభుత్వాలందించే నష్టపరిహారం ఎంతమాత్రం విలువైందికాదన్నారు. ఉగ్రవాదాన్ని మట్టుబెడతామని వాగ్దానం చేసిట్టుగా ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు  ఉగ్రవాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలన్నారు. 

కాగా జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌ కన్నౌజ్ జిల్లాలోని ఆజాన్ గ్రామానికి చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పీఎఫ్) జవాన్ ప్రదీప్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. 
 

మరిన్ని వార్తలు