ఆమెను ఇంటి నుంచి గెంటేశారు!

23 Jan, 2019 11:09 IST|Sakshi

అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తాం

తిరువనంతపురం : అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది. ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు. ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకొని.. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తామని తెగేసి చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా తమ కుటుంబం పరువును కనకదుర్గ గంగలో కలిపిందని.. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఇంట్లోకి రావడానికి వీల్లేకుండా.. ఇంటికి తాళం వేసి ఆమె భర్త బంధువుల దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కనకదుర్గ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోంలో తలదాచుకుంటోంది. 

జనవరి 2న బిందు (40) అనే మరో మహిళతో కలిసి కనకదుర్గ (39) శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప సన్నిధానం చేరుకున్న నిషిద్ధ వయసున్న తొలి మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచింది. వాస్తవానికి అంతకు ముందే డిసెంబర్ 24 ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు. దీంతో పోలీసులు రక్షణ మధ్య వారిని ఇళ్లకు పంపించేశారు. మళ్లీ జనవరి 2న ఆలయంలోకి వెళ్లారు. మరోవైపు తిరువనంతపురంలో మీటింగ్ ఉందని అబద్దం చెప్పి శబరిమలకు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మలప్పురం జిల్లా అరిక్కోడెకు చెందిన కనకదుర్గ దళిత్‌ యాక్టివిస్ట్‌. తన స్నేహితురాలు కనకదుర్గను ఇంట్లోకి రానీయకపోవడానికి కొందరి ఒత్తిడే కారణమని, న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని బిందు తెలిపింది. ఇక బిందు కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కొంది. ఆమెకే కాకుండా తన కూతురుకు కూడా ఈ వేధింపులు ఎదురయ్యాయి. ‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్‌లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్‌ మెయిన్‌టైన్‌ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడు స్కూల్‌కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని బిందు మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు