ప్రముఖ రచయిత్రి కందుకూరి మహాలక్ష్మి కన్నుమూత 

12 Jul, 2020 00:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి కందుకూరి వెంకట మహాలక్ష్మి ఢిల్లీలోని మునిర్కాలో ఉన్న తమ స్వగృహంలో శనివారం ఉదయం 10.30 గంటలకు కన్నుమూశారు. మహాలక్ష్మి తొలితరం రేడియో న్యూస్‌ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన కందుకూరి సూర్యనారాయణ సతీమణి. ఆయన ఆకాశవాణిలో పదవీ విరమణ చేసిన తరువాత ఢిల్లీలో స్థిరపడిన మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆమె రచయిత్రి, గాయని, వ్యాఖ్యాత, నటి, నాటక దర్శకురాలిగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపి మన్ననలు పొందారు. ఆమె 150కి పైగా కథానికలు, మూడు పుస్తకాలు, అనేక కవితలు, నాటకాలు రాశారు. ఆమె రచనలు పలు పత్రికలలో ప్రచురితమై పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఆమెకు 2009లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు అందించింది.

మహాలక్ష్మి ఇంద్రజాల ప్రదర్శనలో కూడా నేర్పరి. తన 12 వ ఏటనే విఖ్యాత ఇంద్రజాలికుడు పీసీ సర్కార్‌ ఎదుట ప్రదర్శన ఇచ్చి ఆయన ప్రశంసలందుకున్నారు. ఆమె 1960 దశకంలో రేడియో మాస్కోలో కూడా పనిచేశారు. బల్గేరియాలో జరిగిన యూత్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 1998లో జరిగిన ప్రపంచ తెలుగు సమావేశానికి సాహిత్య విభాగం చైర్‌పర్సన్‌గా మహాలక్ష్మి వ్యవహరించారు. అదేవిధంగా ఆంధ్ర వనితామండలి ప్రచురించిన ‘న్యాయవాణి’ అనే పత్రికకు సంపాదకురాలిగా కూడా ఉన్నారు. ఇందులో మహిళల సమస్యలకు పరిష్కారాలు చూపేవారు. ఆమెకు మాతృభాషపట్ల ఎనలేని మమకారం. ‘లోకకల్యాణం కోసమే సాహిత్య సేవ’అనే నమ్మకంతో పనిచేసేవారు. మహాలక్ష్మి రచనలపై తిరుపతి, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పలువురు పరిశోధనలు చేసి పీహెచ్‌డీలు పొందారు. ప్రధానంగా జానపద సాహిత్యానికి ఆమె పెద్దపీట వేసి ప్రాచుర్యం కల్పించారు. దేశ,విదేశాల్లో అత్యుత్తమ పురస్కారాలు పొందారు. మహాలక్ష్మి మృతి పట్ల ఢిల్లీలోని పలువురు తెలుగువారు, సాహితీ ప్రముఖులు, తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రతినిధులు తమ సంతాపం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు