మెట్రోను చంపేస్తుంది : సీఎం

25 Nov, 2017 16:49 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛార్జీల పెంపు ఢిల్లీ మెట్రోను చంపేస్తుందని విమర్శించారు. 2002లో ఢిల్లీలో మెట్రో ప్రారంభమైన సమయంలో కనీస ఛార్జీ రూ.4, గరిష్ట ఛార్జీ రూ.8గా ఉండేది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10. మాగ్జిమమ్ ఛార్జీ రూ.60 వరకు పెంచారు. దీంతో తీవ్ర భారంగా భావిస్తున్న ప్రజలు ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. '' మెట్రో ధరల్లో భారీగా పెంపు, ఢిల్లీ మెట్రోను చంపేస్తుంది. ఒకవేళ దీన్ని వాడటం ప్రజలు తగ్గిస్తే, అప్పుడు అది ఏ ప్రయోజనాన్ని సర్వ్‌చేస్తుంది'' అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

ధరల పెంపు అనంతరం దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు తగ్గిపోయినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే కేవలం ధరల పెంపు మాత్రమే ప్రయాణికులను తగ్గించడం లేదని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) పేర్కొంది. ఏడాది వ్యాప్తంగా నెలవారీ మార్పులున్నాయని చెప్పింది. సెప్టెంబరులో రోజుకు సగటున 27.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. అక్టోబరులో ధరలు పెరిగిన తర్వాత ఈ సంఖ్య 24.2 లక్షలకు పడిపోయింది. ధరల పెంపును ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
 

మరిన్ని వార్తలు