కొడుకు పరీక్ష కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..?

15 Mar, 2018 16:24 IST|Sakshi
రజబ్‌ అలీ పంచిపెట్టిన ఆహ్వానపత్రిక

కోల్‌కతా : ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశిస్తారు. అందుకోసం వారి జీవితాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధమవుతారు. మరికొందరు తాము పొందలేని అవకాశాలు పిల్లలకు కల్పించి వారి భవిషత్తులో ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాంటి కోవకు చెందిన వారే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజబ్‌ అలీ. ఆయన కథేంటో ఓసారి చూద్దాం.

పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన అలీ పేదరైతు. వంశపారంపర్యంగా వచ్చిన భూమి తప్ప తనవద్ద ఇంకేమీ లేదు. చిన్ననాటి నుంచి అతనికి డాక్టర్‌ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆరుగురు పిల్లలు ఉండటంతో కుటుంబ పోషణ తండ్రికి భారమైంది. అందుకే మూడో తరగతిలోనే డ్రాపౌట్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. అలా పదేళ్ల వయస్సుకే పొలం పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబంలో ఇంతవరకు ఎవరూ కూడా పదో తరగతి వరకు చదివిన దాఖలాలు లేవు. అందుకే కొడుకు ద్వారా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని అలీ కోరుకుంటున్నాడు.

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తన కొడుకు షమీమ్‌ షేక్‌ను దీవించాలంటూ ఏకంగా 700 మందికి విందు ఏర్పాటు చేశాడు. తమ కుటుంబంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న మొదటి వ్యక్తి కనుక తాహతుకు మించిన ఈ పనికి సిద్దపడ్డానని తెలిపాడు. కొన్నాళ్ల కిందట ‘నాకు తారసపడిన కొందరు వ్యక్తులు.. గ్రామస్తుల దీవెనలుంటే మీ కొడుకు తప్పక ఉత్తీర్ణుడవుతాడని చెప్పారు. అందుకే సంవత్సర కాలంగా ఈ విందు కోసం డబ్బు పొదుపు చేస్తున్నా’ని తెలిపాడు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆహ్వాన పత్రిక కూడా అచ్చువేయించి అందరికీ పంచాడు.

అతిథులను ఆనందపరిచేందుకు తన స్థోమతకు తగ్గట్టుగా చికెన్‌, పప్పు, కూరగాయలు, స్వీట్లతో విందు ఏర్పాటు చేశాడు. ఆ అతిథులు కూడా పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలను షమీమ్‌కు కానుకలుగా ఇచ్చారు. కానీ వారిచ్చిన బహుమతుల కన్నా వారి దీవెనలే మహాభాగ్యమని మురిసిపోతున్నాడు అలీ. తన కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఊరంతా స్వీట్లు పంచుతానని చెబుతున్న అలీ వంటి తండ్రిని తామెక్కడా చూడలేదని స్థానిక స్కూల్‌ టీచర్‌ సుశాంత చౌదరీతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు