గో హత్య చేశారంటూ.. కుటుంబం మొత్తానికి శిక్ష

3 Jan, 2019 13:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : అనుకోకుండా జరిగిన ఘటనకు ఓ కుటుంబం గ్రామ బహిష్కరణకు గురైంది. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల ఆవు మృతికి కారణమైన వ్యక్తి, అతని కుటుంబానికి గ్రామ పంచాయతీ సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానం చేశారు. గంగానదిలో మునిగి వస్తేనే తిరిగి గ్రామంలోకి రావాలని హుకుం జారీ చేశారు. దాంతోపాటు ఊరంతా భోజనాలు (కన్య అండ్‌ బ్రాహ్మణ్‌ భోజ్‌), ఒక గోవును దానంగా కూడా ఇవ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో తిరిగి ఊర్లోకి రానిచ్చేది లేదని హెచ్చరించారు. ఈ ఘటన భోపాల్‌కు 402 కిలోమీటర్ల దూరంలోని షియోపూర్‌లో మంగళవారం జరిగింది. వివరాలు.. పప్పు ప్రజాపతి (36) ఎప్పటిలాగానే తన ఇంటివద్ద ట్రాక్టర్‌ను పార్కింగ్‌ చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఆవును అతను గుర్తించలేదు. దీంతో ట్రాక్టర్‌ వెనక చక్రాల కిందపడి ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌ పంచమ్‌ సింగ్‌ పంచాయతీ నిర్వహించాడు. ప్రజాపతి గో హత్య చేశాడని తేల్చిన పంచాయతి సభ్యులు శిక్ష విధిస్తూ తీర్మానించారు.

‘ట్రాక్టర్‌ని పార్కింగ్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ ట్రాలీ వెనక చక్రాల కిందపడి ఆవు చనిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు చాలా బాధగా ఉంది. కానీ, పంచాయతీ పెద్దలు నేను గో హత్య చేశానంటూ దోషిగా నిలబెట్టారు. నాతో సహా కుటుంబం మొత్తానికి శిక్షలు ఖరారు చేశారు’ అని ప్రజాపతి వాపోయాడు. ఘటనపై సమాచారం అందిందనీ, అవసరమైన చర్యలు తీసకుంటామని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాజేంద్ర రాయ్‌ చెప్పారు. కాగా, పంచాయతీ తీర్పునకు కట్టుబడి ప్రజాపతి కుటుంబంతో సహా గంగానదిలో స్నానానికి బయలుదేరారు.

పాపం మూటగట్టుకున్నారు..
గో హత్య చేసి ప్రజాపతి కుటుంబం పాపం మూటగట్టుకుంది. పంచాయతీ విధించిన శిక్షను వారు అనుభవిస్తే పాపపరిహారం జరుగుతుంది. 
-ఓం ప్రకాశ్‌ గౌతమ్‌, పంచాయతీ మెంబర్‌

మరిన్ని వార్తలు