‘సీఎం సారూ.. చావాడానికైనా అనుమతివ్వండి’

19 Mar, 2019 08:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అప్పులో ఊబిలో చిక్కుకున్న ఓ రైతన్న

లక్నో : అప్పుల ఊబిలో చిక్కుకొని సతమతమవుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రదీప్‌ శర్మ అనే రైతన్న.. కనీసం చావాడానికైనా అనుమతివ్వాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరాడు. అంతేకాకుండా ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి పథకం ద్వారా వచ్చిన రూ.2 వేలను కూడా తిరిగిపంపించాడు. పంట నష్టపరిహారం కోసం కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా ఒక్కరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి తిరిగి ఓపిక నశించిందని కనీసం కారుణ్యమరణానికైనా అనుమతినివ్వాలని కోరుతూ లేఖ రాశాడు. ఆలుగడ్డ పండించే ప్రదీప్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం కూడా సాయం చేయలేకపోతే.. కనీసం చావాడానికైనా అనుమతివ్వమనండి. రూ.35 లక్షల అప్పులో కూరుకోపొయా.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

2016లో జరిగిన పంట నష్టంతో తీవ్రంగా అప్పులయ్యాయని, అప్పుడే జిల్లా అధికారుల చుట్టూ నష్టపరిహారం కోసం తిరిగానని, ఎవ్వరూ స్పందించలేదన్నాడు. గతేడాది డిసెంబర్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ఢిల్లీలో స్వయంగా కలిసి తన బాధను పంచుకున్నానని, కానీ ఎలాంటి పరిహారం లభించలేదన్నాడు. ఈ అప్పులతోనే తన మామ గుండెపోటుతో మరణించాడని, ఈ విషయం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నాడు. తనకు జరిగిన నష్టానికి పీఎం ఇచ్చే రూ.2వేలు ఏమాత్రం సరిపోవని, అందుకే తిరిగిచ్చేశానన్నాడు. ఇక గతంలో మహారాష్ట్ర ఉల్లి రైతులు కూడా ఇదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తమ పంట ద్వారా వచ్చిన సొమ్మును పంపించి నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు