రైతు ఆదాయం నెలకు‌ ఆరువేలే..

23 Mar, 2018 20:27 IST|Sakshi

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో ఒక రైతు కుటుంబం అన్ని వనరుల నుంచి పొందే ఆదాయం సగటున నెలకు కేవలం రూ.6,426 మాత్రమేనని వ్యవసాయ,  రైతు సంక్షేమ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు.  

దేశంలోని రైతు కుటుంబాల వార్షిక ఆదాయ గణాంకాలను జాతీయ శాంపిల్‌ సర్వే 2013లో సేకరించినట్లు మంత్రి తెలిపారు. ఆ సర్వే దేశంలోని ఒక రైతు కుటుంబం పొందే నెలసరి ఆదాయం సగటున 6426 రూపాయలుగా అంచనా వేసినట్లు తెలిపారు. 2018-19 ఏడాదికి రైతు కుటుంబాల వార్షిక ఆదాయాల గణన నేషనల్‌ శాంపిల్‌ సర్వే చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం  2018 జనవరి నుంచి 2019 డిసెంబర్‌ వరకు కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

మైక్రో ఇరిగేషన్‌తో ఖర్చుల్లో తగ్గుదల..
సాగు వ్యయంలో మైక్రో ఇరిగేషన్‌ ద్వారా 20 నుంచి 50 శాతం ఖర్చులు తగ్గించుకోవచ్చునని గజేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఎరువుల ఖర్చులో 28 శాతం ఆదా చేయవచ్చునని తెలిపారు.  విద్యుత్‌ వాడకాన్ని 31 శాతం తగ్గించుకునే అవకాశం మైక్రో ఇరిగేషన్‌ కల్పిస్తుందన్నారు. ఈ విధానంలో పంట ఉత్పాతకత 42 నుంచి 52 శాతం పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైందని మంత్రి అన్నారు. తద్వారా రైతు ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సాధ్యమౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు