కేజీ ఉల్లిపాయలు 50 పైసలే!

13 May, 2016 13:38 IST|Sakshi
కేజీ ఉల్లిపాయలు 50 పైసలే!

ఔరంగాబాద్ః ఉల్లి... రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి, అమ్మకానికి తెచ్చేసరికి ధరాఘాతం ఆవహించడం రైతన్నను కుదేలు చేస్తోంది. టన్నులకొద్దీ ఉల్లిపాయలు అమ్మినా.. వందల్లో కూడ డబ్బు చేతికి రాకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

అధః పాతాళానికి పడిపోయిన ఉల్లి ధరలను చూసి, ఔరంగాబాద్ లాసూర్ హోల్ సేల్ మార్కెట్లో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మార్కెట్ కు తెచ్చిన 450 కేజీల ఉల్లిపాయలను అమ్మగా... కేవలం 175 రూపాయలు మాత్రమే రావడం అక్కడి రైతును తీవ్ర ఆవేదనకు గురి చేసింది. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే ఎందుకా అని ఆశ్చర్యపోయేవాడినని, నిజంగా ప్రస్తుత ఉల్లి ధరలు చూస్తే.. ఏ రైతులైనా ఆత్మ హత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని... చిన్నతనంలో ఉల్లి పంటను పండించిన  ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తాలూకా రైతు అంటున్నారు. అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన మారాఠ్వాడా లోని లాసూర్  మార్కెట్లో మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు తీవ్ర ధరాఘాతానికి గురై.. వేలంలో 100 కేజీలకు 500 నుంచి 600 రూపాయలు ధర పలకడం రైతును నట్టేట ముంచింది. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన నాసిక్ ఉల్లి మార్కెట్లో కూడ సరఫరాలో పెరుగుదలతో  ధర తీవ్రంగా పడిపోయి, క్వింటాల్ కు 720 రూపాయలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

చాలామంది రైతులకు తాము పండించిన పంటను నిల్వ చేసుకునే అవకాశం లేదని, ఎకరానికి 50 వేల నుంచి 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు...  మార్కెట్లో ధర పలకకపోవడంతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడ తిరిగి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువు కారణంగా చాలామంది చెరకు రైతులు కూడ ఈసారి ఉల్లిపంటను ఆశ్రయించారని, ప్రస్తుత పరిస్థితుల్లో  నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం రైతులనుంచి ఉల్లి కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15,000 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసి, రైతులకు సాగులో సహాయపడతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు బిజేపీ ప్రాంతీయ ప్రతినిధులు చెప్తున్నారు. ఏది ఏమైనా డిమాండ్, సప్లైల్లో సమతుల్యత లేకపోవడమే ధర పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తలు