రైతు ర్యాలీ భగ్నం

3 Oct, 2018 01:28 IST|Sakshi
ఢిల్లీలో లాఠీచార్జీ చేస్తున్న పోలీసులపై తిరగబడుతున్న ఓ వృద్ధ రైతు

న్యూఢిల్లీ/సేవాగ్రామ్‌: రుణ మాఫీ తదితర డిమాండ్లతో భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) తలపెట్టిన కిసాన్‌ క్రాంతి యాత్రను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దుల్లో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. రైతుల దాడిలో ఏసీపీ సహా ఏడుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి.  

బీకేయూ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు గత నెల 23న ర్యాలీగా బయలుదేరారు. బీకేయూ అధ్యక్షుడు నరేశ్‌ తికాయత్‌ ఆధ్వర్యంలో  ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా వస్తున్న రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లో యూపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే వాటర్‌ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించి రైతులను చెదరగొట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తమను లాఠీలతో కొట్టారని కొందరు రైతులు ఆరోపించగా పోలీసులు ఖండించారు. బీకేయూ ర్యాలీ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.   

రోడ్డు పక్కనే రైతుల బస: పోలీసు చర్య అనంతరం రైతులు ఢిల్లీ–యూపీ సరిహద్దుల్లోనే కిలోమీటర్‌ మేర మకాం వేశారు. వెంట తెచ్చుకున్న దుస్తులు, దుప్పట్లు వేసుకుని ట్రాక్టర్లు, ట్రాలీల పక్కనే నిద్రకు ఉపక్రమించారు. కొందరు తమ వెంట జనరేటర్లు కూడా తెచ్చుకున్నారు. స్వామి నాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం
పోలీసుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ అహింసా దినం రోజున దేశ రాజధానిలో రైతులపై కేంద్రం దాడి చేయించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


రైతుల డిమాండ్లు ఇవీ..
చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి. దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
 ప్రధానమంత్రి మంత్రి ఫసల్‌ బీమా యోజన పునరుద్ధరించాలి.
 పదేళ్లు పాతబడిన డీజిల్‌ ట్రాక్టర్లపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధాన్ని ఎత్తివేయాలి.
డీజిల్‌ ధరలను తగ్గించాలి.
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు
♦  60ఏళ్ల పైబడిన రైతులకు వృద్ధాప్య పింఛను
యూపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలి.

యాత్రలో పాల్గొన్న  రైతులు: సుమారు 70వేలు
ఏయే రాష్ట్రాల రైతులు: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల నుంచి.
ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది: సెప్టెంబర్‌ 23న హరిద్వార్‌లో

మరిన్ని వార్తలు