ఊపందుకుంటున్న రైతుల సమ్మె

2 Jun, 2018 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రుణాల మాఫీ తదితర డిమాండ్లపై మధ్యప్రదేశ్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైన రైతుల పది రోజుల సమ్మె శనివారం నాటికి హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాలకు విస్తరించింది. ‘గావ్‌ బంద్‌’ పేరిట ప్రారంభించిన ఈ సమ్మె ప్రభావం మొదటి రోజు పెద్దగా కనిపించలేదు. రెండోరోజు కొద్దిగా కనిపించింది. మరికొన్ని రోజుల్లో కూరగాయలు, పాల సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయి గ్రామీణ జీవనం పూర్తిగా స్తంభించిపోతుందని, దాని ప్రభావం పట్టణ ప్రాంతాలపై తీవ్రంగా ఉంటుందని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో సమ్మెకు సమన్వయకర్తగా పనిచేస్తున్న రాష్ట్రీయ కిసాన్‌ మహాసంఘ్‌ తెలిపింది.

దేశవ్యాప్తంగా రైతులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతోపాటు భూ సంస్కరణలను అమలు చేయాలని, పంపు సెట్లకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మహారాష్ట్రలో సమ్మె ప్రభావం అక్కడక్కడా మాత్రమే కనిపిస్తోంది. గతంలో నాసిక్‌ నుంచి ముంబై వరకు దాదాపు 40 వేల మంది రైతులతో భారీ ర్యాలీ జరిగిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కారణంగానే రైతుల నుంచి ఈసారి అంతగా స్పందన లేనట్లుంది.

మధ్యప్రదేశ్‌లో కూడా సమ్మె ప్రభావం ఈ రోజు అంతంత మాత్రంగానే కనిపించింది. పలు కూరగాయల మార్కెట్లు యథావిధిగానే తెరచి ఉన్నాయి. గతేడాది జూన్‌ నెలలో పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులు మరణించిన మండసార్‌లో సమ్మె ప్రభావం కొద్దిగా కనిపించింది. మార్కెట్‌కు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. ధరలు కొద్దిగా పెరిగాయి. కొన్ని చోట్ల కూడళ్లలో రైతులు సింబాలిక్‌గా పాలను, కూరగాయలను వీధుల్లో పారబోస్తున్నారు. ఈ ఆందోళన తీవ్రమైతే పాలు, కూరగాయలకు కొరత ఏర్పడుతుంది.  మరికొన్ని రోజుల్లో సమ్మె తీవ్రం కానుట్లు సమ్మెకు సంఘీభావం ప్రకటించిన అన్ని రైతు సంఘాలు తెలియజేస్తున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా