రాత్రికి రాత్రే పరిష్కరించలేం!

7 Jul, 2017 00:49 IST|Sakshi
రాత్రికి రాత్రే పరిష్కరించలేం!

రైతు ఆత్మహత్యలపై కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల సమస్యను రాత్రికి రాత్రే పరిష్కరించలేమని సుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఫసల్‌ బీమా యోజన వంటి రైతు అనుకూల పథకాలు మెరుగైన ఫలితాలివ్వాలంటే కనీసం ఒక సంవత్సరం గడువు అవసరమన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ఏకీభవించింది. రైతుల దుస్థితికి పరిహారం పరిష్కారం కాదని, రైతు సంక్షేమ పథకాల్ని పేపర్లకు పరిమితం కాకుండా చూడాలంది. ఈ సంద్భరంగా రైతు ఆత్మహత్యలపై ఎన్జీఓ సంస్థ సిటిజెన్స్‌ రిసోర్స్‌ అండ్‌ యాక్షన్‌ ఇనీషియేవ్‌(సీఆర్‌ఏఎన్‌టీఐ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను 6 నెలలు వాయిదా వేసింది.

విచారణ ప్రారంభంలో కోర్టు స్పందిస్తూ.. ‘రైతుల ఆత్మహత్యలకు పరిహారం చెల్లింపు ఎప్పటికీ పరిష్కారం కాదు. అప్పు చెల్లించే పరిస్థితిలేకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందువల్ల రుణాల బాధలతో తలెత్తే ఇబ్బందుల్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. రుణాలపై బీమా సదుపాయం కల్పించాల’ని పేర్కొంది. రైతుల ఆత్మహత్యల్ని ఒక్క రోజులో పరిష్కరించలేమని, మంచి ఫలితాలు సాధించాలంటే ఒక సంవత్సరం సమయమివ్వాలన్న అటార్నీ జనరల్‌ వాదనతో ఏకీభవిస్తున్నామని సీజేఐ జస్టిస్‌  ఖేహర్, జస్టిస్‌ చంద్రచూడ్‌ల బెంచ్‌ తెలిపింది.

5.34 కోట్ల రైతులకు బీమా సదుపాయం
కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదిస్తూ.. ‘ఎన్డీఏ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ చర్యల్ని చేపట్టింది.  ఫలితాలకు సమయమివ్వాలి. కష్టాల నుంచి రైతుల్ని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొత్తం 12 కోట్ల మంది రైతులకుగాను 5.34 కోట్ల మందికి ఇప్పటికే ఫసల్‌ బీమా యోజన, ఇతర సంక్షేమ పథకాల కింద బీమా సదుపాయం ఉంది. 30 శాతం రైతుల భూమికి పంటల బీమా పథకం వర్తింపచేశాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్జీవో తరఫు న్యాయవాది కోలిన్‌ గోన్సల్వెస్‌ వాదిస్తూ.. 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

‘నకిలీ’ ఉద్యోగాలు చెల్లవు..
న్యూఢిల్లీ: రిజర్వేషన్‌ కేటగిరీలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు చట్టం దృష్టిలో చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ ఖేహర్, జస్టిస్‌ చంద్రచూడ్‌ల ధర్మాసనం గురువారం ఆ మేరకు తీర్పునిస్తూ.. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించబోమంది. తీర్పు తక్షణం అమల్లోకొస్తుందని బెంచ్‌ పేర్కొంది. దీర్ఘకాలం ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తి నకిలీ ధ్రువీకరణ పత్రాలతో మోసగించాడని తేలితే.. మిగతా కొద్ది కాలం అతను ఉద్యోగంలో కొనసాగేందుకు అనుమతిస్తూ గతంలో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలువురు కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు