సీఆర్పీఎఫ్‌ అదుపులో మాజీ సీఎం సోదరి, కుమార్తె

15 Oct, 2019 14:51 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్‌ కూడా ఉన్నారు. సురయ్య, సఫియాలు ఆధ్వర్యంలో పలువురు మహిళలు చేతులకు నల్లని బ్యాండ్స్‌ ధరించి, ప్లకార్డులు పట్టుకుని ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. వారంతా ఒకచోట చేరేందుకు ప్రయత్నించగా పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో వారు రోడ్డుపై కుర్చోని ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్‌ మహిళా అధికారులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అలాగే నిరసన తెలుపుతున్న మహిళలు మీడియాకు తమ సందేశాన్ని ఇవ్వకుండా అడ్డుకునేందుకు యత్నించారు. 

ఆ మహిళల విడుదల చేసిన ప్రకటనలో.. కశ్మీర్‌లోని ప్రజల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని కోరారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు తమను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370, 35ఏ లను రద్దు చేస్తూ  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కశ్మీర్‌ మహిళలుగా తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలిపారు. గృహ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  అలాగే కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులకు విరుద్ధంగా, వాస్తవాలను వక్రీకరించేలా జాతీయ మీడియా కథనాలు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీన జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో అంక్షలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌, మెహబూబా ముఫ్తీలతో పలువురు నేతలను, వేర్పాటువాదులను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు.

మరిన్ని వార్తలు