యూపీలోనే మరో గోరఖ్‌పూర్‌ ఘటన

4 Sep, 2017 11:35 IST|Sakshi
యూపీలోనే మరో గోరఖ్‌పూర్‌ ఘటన
సాక్షి, యూపీ: గోరఖ్‌పూర్‌ చిన్నారుల మృత్యు ఘోష కళ్ల ముందు కదలాడుతుండగానే ఇప్పుడు వరుసగా అలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. జార్ఖండ్‌ లో మొన్నీమధ్యే ఎంజీఎం ఆస్పత్రిలో పౌష్టికాహర లోపంతో 52 మంది చిన్నారులు  చనిపోగా, తాజాగా ఉత్తర ప్రదేశ్ లోనే మరో ఆస్పత్రిలో 49 మంది పిల్లలు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
 
ఫర్రూఖాబాద్‌లోని రామ్‌ మనోహర్ లోహియా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల వ్యవధిలో 49 మంది పిల్లలు చనిపోయారు. వీరిలో అప్పుడే పుట్టిన 19 మంది శిశువులు ఉండటం శోచనీయం.  ఆక్సిజన్‌ సరఫరా లేమి, మందుల కొరత ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
సకాలంలో సిబ్బంది స్పందించలేదన్న తల్లిదండ్రుల ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎఫ్‌ఐఆర్‌లో మెడికల్‌ ప్రధానాధికారితోపాటు, పలువురి వైద్యుల పేర్లను నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఫర్రూఖాబాద్‌ ఎస్పీ దయానంద్‌ మిశ్రా తెలిపారు.