జేఎన్‌యూ దాడి: ఫాసిస్ట్‌ సర్జికల్‌ స్రైక్స్‌..!

6 Jan, 2020 15:23 IST|Sakshi

విద్యార్థులపై ప్రణాళికా ప్రకారమే దాడి

విద్యార్థులంతా ఐక్యంగా ఉండాలి : బెంగాల్‌ సీఎం మమత

కోల్‌కత్తా : దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింసను బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఫాసిస్ట్‌ సర్జికల్‌ స్రైక్స్‌గా ఆమె అభివర్ణించారు. దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనకు మమత మద్దతు తెలిపారు. విద్యార్థులంతా ఐక్యంగా ఉండాలని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమె పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులపై ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి అని అభిప్రాయపడ్డారు. ‘విద్యార్థులతో పాటు అధ్యాపకులపై సైతం దాడికి పాల్పడ్డారు. ఇది నాకు మాత్రమే కాదు అందరికీ బాధాకరం. వర్సిటీలోకి బీజేపీ కుట్రపూరితంగా గుండాలను పంపుతోంది. దీనిలో పోలీసులు ప్రమేయం కూడా ఉంది.’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. (జేఎన్‌యూలో దుండగుల వీరంగం)

కాగా ప్రతిష్టాత్మక వర్సిటీలో చోటుచేసుకున్న ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. విద్యార్థులపై దాడిని పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని, ఇలాంటి చర్యలను ఏమాత్రం క్షమించేదిలేదని అభిప్రాయపడుతున్నారు. ముసుగు దుండుగులు పాల్పడిన దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ సహా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘోష్‌ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. తనపై దాడికి పాల్పడిన వారిని గుర్తుపడతానని ఘోష్‌ చెబుతున్నారు. (జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!)

>
మరిన్ని వార్తలు