ప్యారిస్‌ టూర్‌ అన్నారు.. హాస్టల్‌లో తిండికీ దిక్కులేదు

11 Apr, 2019 11:37 IST|Sakshi
సమస్యలు వివరిస్తున్న తెలుగు విద్యార్థులు

ఓ ఫ్యాషన్‌ విద్యాలయం విద్యార్థుల ఆవేదన  

లక్షల ఫీజులు వసూలు చేసి కనీస వసతులూ కల్పించలేదని ధర్నా  

దొడ్డబళ్లాపురం: ‘ఫ్యాషన్‌ రాజధాని అయిన ప్యారిస్‌ నగరాన్ని చూపిస్తాం. అద్భుతమైన టీచింగ్, మంచి ఉద్యోగాలు గ్యారంటీ అన్నారు. తీరా క్లాసులకి వెళ్తే బోధకులు కూడా లేరు’ అని విద్యార్థులు లబోదిబోమన్నారు. లక్షలకొద్దీ ఫీజులు దండుకుని సౌకర్యాలు కల్పించని కాలేజీ మేనేజ్‌మెంట్‌కి వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా చేసిన సంఘటన దొడ్డబళ్లాపురం అపెరల్‌ పార్కులోని ఓ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థుల్లో అధికమంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. మంగళవారం సాయంత్రం నుండి అర్థరాత్రి వరకూ విద్యార్థులు తరగతులు భహిష్కరించి కాలేజ్‌ మెయిన్‌ గేట్‌ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు విద్యార్థులు అమత, కీర్తన తరదితరులు కాలేజీలో చేరేముందు అనేక హామీలు ఇచ్చిన యాజమాన్యం, విద్యార్థులు చేరాక తమ సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు.


కాలేజీ గేట్‌ వద్ద బైఠాయించిన విద్యార్థులు

ప్లేస్‌మెంట్లు లేవు, ఫ్యాషన్‌ షోలు లేవు  
ముఖ్యంగా ప్లేస్‌మెంట్లు కల్పించడం లేదని, ఫ్యాషన్‌ షోలు, గ్రాడ్యుయేషన్‌ డేలు నిర్వహించడం లేదని వాపోయారు. విద్యార్థులందరికీ ఒకే మొత్తం ఫీజు కాకుండా రూ.3 లక్షల నుండి 15 లక్షల వరకూ వసూలు చేశారన్నారు. తీరా కాలేజీలో చూస్తే టీచర్లు లేరని, ల్యాబ్‌లు, ఎక్విప్‌మెంట్లు అస్సలు లేవన్నారు. లక్షల ఫీజులు వసూలు చేసిన మంచి నీరు,నాణ్యమైన ఆహారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నిస్తే సిబ్బంది బెదిరిస్తున్నారని, డిగ్రీ క్యాన్సిల్‌ చేయిస్తానని, అంతు చూస్తామని సర్టిఫికెట్లు ఇవ్వకుండా హెచ్చరిస్తున్నారన్నారు. కాలేజ్‌లో చేరిన మొదటి రోజుల్లో విద్యార్థులను ప్యారిస్‌ తీసికెళ్తామని చెప్పారని, అందుకు డబ్బులు కూడా అధికంగా కట్టించుకుని ఇప్పుడు ఆ వూసే ఎత్తడం లేదన్నారు. తరచూ ప్రిన్సిపాల్స్‌ మారుతుండడంతో కాలేజీలో చెప్పుకోడానికీ దిక్కులేకుండాపోయిందన్నారు. కాలేజీ ఫీజులుకాక అధికంగా వివిధ రకాలుగా ఫీజులు గుంజుతున్నారన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ కాలేజీలో చేరితే నిలువునా ముంచేసారని భోరుమన్నారు. అనంతరం పోలీసుల జోక్యంతో విద్యార్థులు ధర్నా విరమించారు. 

మరిన్ని వార్తలు