అలా పెరిగే కోళ్లతో డేంజర్‌

2 Mar, 2020 15:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోళ్ల పరిశ్రమలో లాభాపేక్ష కొక్కరొకో! అంటోంది. స్వల్ప కాల వ్యవధిలో అధిక లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొందరు కోళ్ల పెంపకం దారులు పెడదారులు తొక్కుతున్నారు. జన్యుపరమైన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా 50, 60 రోజుల్లో పెరగాల్సిన కోడి పిల్లలను 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. పర్యవసానంగా కోళ్ల కాళ్లు, గుండె, ఊపిరితిత్తులు తగిన రీతిలో ఎదగకుండా దెబ్బతింటున్నాయి. వీటివల్ల కోళ్లలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరణం సంభవించకపోయిన కోళ్ల కాళ్లల్లో కురుపులు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. 

ఇలా అనవసరంగా కోళ్లను వేగంగా పెరగనిచ్చి వాటిని కొంత చౌక ధరలకు విక్రయిస్తుండడం వల్ల వాటినే కొనుగోలు చేసేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు ప్రాధాన్యతనిస్తున్నాయని, ప్రస్తుతం లండన్‌ మార్కెట్‌లో ఇదే జరుగుతోందని ‘రాయల్‌ సొసైటీ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రుయాలిటీ టు యానిమల్స్‌ (ఆర్‌ఎస్‌పీసీఏ)’ వెల్లడించింది. ‘వరల్డ్‌ యానిమల్‌ ప్రొటెక్షన్‌’, ‘ఫామ్‌ యానిమల్‌ వెల్ఫేర్‌ ఫోరమ్‌’లతో కలిసి అతి వేగంగా పెంచుతున్న మూడు రకాల కోళ్ల బ్రీడింగ్‌పై ఆర్‌ఎస్‌పీసీఏ అధ్యయనం జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70 రోజులు పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఆ స్థాయికి జన్యు ఇంజెక్షన్ల ద్వారా పెంచేసి విక్రయిస్తున్నారని ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. 

ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ తామిచ్చిన పిలుపునకు కెఎఫ్‌సీ, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్, వెయిట్‌రోస్‌ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలా అతి వేగంగా పెంచుతున్న కోళ్లు అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం సాధారణంకన్నా రెట్టింపు ఉంటోందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయంలో ఈ అధ్యయనం జరగలేదని, ఇలా వేగంగా పెంచడం వల్ల కోళ్లు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తోందన్న విషయంలోనే ఈ అధ్యయనం కొనసాగిందని అధ్యయన సంస్థ పేర్కొంది. ఇలా జన్యుపరంగా వేగంగా పెంచిన కోళ్లు అనారోగ్యం, అనవసరమైన బాధతోని అర్ధాయుషు మాత్రమే బతుకుతున్నాయని వరల్డ్‌ యానిమల్‌ ప్రొటెక్షన్‌ బ్రిటన్‌ చీఫ్‌ జేమ్స్‌ మాక్‌కోల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా