కీర్తి శిఖరాన్ని తాకారు

24 May, 2018 22:52 IST|Sakshi

ఎవరెస్టును అధిరోహించిన తండ్రీకూతుళ్లు అజీత్‌.. దియా

సాక్షి, స్టూడెంట్‌ ఎడిషన్‌ 
ఎవరెస్టు...ఈ పేరు విన్న ఔత్సాహికులు ఒక్కసారైనా దాన్ని అధిరోహించాలని తహతహలాడుతుంటారు. కొంతమంది ఒంటరిగా, మరికొంతమంది బృందంగా దీనిని అధిరోహిస్తుంటారు. పర్వతారోహకుల్లో  బంధువులు లేదా కుటుంబసభ్యులు ఉండడమనేది అరుదు. అందులోనూ తండ్రీకూతుళ్లు ఉండడం అనేది ఇంకా అరుదు. ఆ కోవకే చెందుతారు అజీత్‌ బజాజ్‌ ఆయన కుమార్తె దియా బజాజ్‌. గుర్గావ్‌కు చెందిన వీరు ఈ నెల 16వ తేదీన 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టు అధిరోహించారు. ఈ పర్వతాన్ని ఎక్కడమంటే కఠినమైన పరిస్థితుల్లో ముందుకు సాగడమే. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అజీత్‌ ఆయన కుమార్తె దియా తొలి ప్రయత్నంలోనే తమ లక్ష్యాన్ని సాధించడం విశేషం. ప్రాణాంతకమైన సవాళ్లను లెక్కచేయకుండా, తీవ్ర చలి వాతావరణమనే ఆందోళన లేకుండా గమ్యాన్ని చేరుకున్నారు. 

దశాబ్దం క్రితం సాహసోపేత ప్రయాణ సంస్థల నిర్వాహకుడైన 53 ఏళ్ల బజాజ్‌ ...ఒకే ఏడాది వ్యవధిలో దక్షిణ, ఉత్తర ధ్రువాలను తిలకించారు. అలా ఒకే ఈ రెండుచోట్లకి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఆయన పెద్దకుమార్తె దియా...పర్యావరణ సైన్సులో డిగ్రీ చదివి ఉత్తరకాశిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ సంస్థలో పర్వతారోహణపై శిక్షణ పొందింది. 14 ఏళ్ల  లేలేత వయసులోనే ట్రాన్స్‌ గ్రీన్‌లాండ్‌ యాత్ర చేసింది. 2012లో యూరప్‌లో అత్యంత ఎత్తయిన 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించింది.  

ఏడాదిపాటు శిక్షణ: ‘ఎవరెస్టు శిఖరాన్ని తిలకించాలని ఇరువురం గతేడాది నిర్ణయించుకున్నాం. శిక్షణ అత్యంత ఉల్లాసభరితంగా సాగింది. శారీరకంగా మంచి ఆకృతిని పొందడం కోసం జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేశాం. పరుగులు తీశాం. ఈత కొట్టాం. గతేడాది ఆగస్టులో లడఖ్‌ యాత్రకు  వెళ్లాం. ఎవరెస్టుకు ముందు ట్రయలర్‌గా ఈ యాత్ర సాగించాం’ అని అజీత్‌ చెప్పారు.  ‘ఇటువంటి మూడు సాహస యాత్రల తర్వాత గతేడాది డిసెంబర్‌లో నేపాల్‌ వెళ్లాం. అవసరమైన సామగ్రి కొనుగోలు చేశాం. ఆ తర్వాత రెంజోలా పాస్‌ చేరుకున్నాం. తిరిగి లడఖ్‌ చేరుకుని అక్కడ కొద్దిరోజులు గడిపాం, మాపై పూర్తి నమ్మకం కలిగింది. ఏప్రిల్‌ పదిన టిబెట్‌ వెళ్లాం. ఈ నెల 16న ఎవరెస్టు పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం ’ అని దియా చెప్పారు.

 

అజిత్, దియా స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల. అజీత్‌ను చిన్నతనంలో వాళ్ల నాన్న సరదాగా తరచూ పర్వతారోహణకు తీసుకెళ్లేవాడు. ఢిల్లీలోని స్టీఫెన్‌ కళాశాలలో చదువుకునే రోజుల్లో అజీత్‌ ఔట్‌డోర్‌ క్లబ్‌లో సభ్యుడయ్యాడు. అదే సమయంలో తరచూ సాహసోపేత క్రీడల్లోనూ పాలుపంచుకునేవాడు. ఆ తర్వాత అదో వ్యాపకంగా మారిపోయింది. దియాను కూడా తరచూ తన వెంట తీసుకుపోయేవాడు. తనకు ఇటువంటి తండ్రి దొరకడం పూర్వజన్మ సుకృతమంటూ దియా పొంగిపోయింది. పైగా సాహసయాత్రలో తండ్రే భాగస్వామి కావడం అదృష్టమని చెప్పుకొచ్చింది. 

చిన్నతనంలో ఈత అంటే సరదా అని, ఆ తర్వాత జాతీయస్థాయి క్రీడల్లో కూడా పాలుపంచుకున్నానంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంది.  ‘అంటార్కిటాలో రెండో అతిపెద్ద భాగమైన గ్రీన్‌లాండ్‌ ఐస్‌ క్యాప్‌ను అతి చిన్న వయసులో దాటిన రికార్డు నా సొంతం. ఎవరెస్టుపై మా యాత్ర సాగే సమయంలో ఓ రాత్రి భీకర తుపాను వచ్చింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు కూడా వీచాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యాం.  తెల్లవారాక అంతా సర్దుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని తెలిపింది.  

మరిన్ని వార్తలు