తండ్రి కొడుకులు ఒకేసారి టెన్త్‌ పాస్‌..! 

8 May, 2018 12:47 IST|Sakshi

భువనేశ్వర్‌: చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ చదువుకు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదని నిరూపించారు ఓ తండ్రి కొడుకులు. చదువుకు స్వస్తి చెప్పిన చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్‌ బీజ్‌(58), అతని కొడుకు కుమార్‌ బిస్వాజిత్‌ బీజ్‌(30) ఇద్దరూ ఒకే సారి పదో తరగతి ఉత్తీర్ణులయ్యారు. కాగా తండ్రి కొడుకులకి ఒకే విధమైన మార్కులు(342) రావడం విశేషం. అరుణ్‌ కుమార్‌ ఓ సీనియర్‌ బీజేపీ లీడర్‌. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏడో తరగతి చదువుతుండగా తండ్రి చనిపోవడంతో చదువు మానేశాడు. రాజకీయంగా ఎదిగినా చదువుకోలేదన్న బాధ ఎపుడూ తనను వెంటాడేదని అరుణ్‌ తెలిపారు.

‘2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో ఎడ్యుకేషన్‌ కాలమ్‌ ఖాళీగా వదిలేయడం వల్ల సిగ్గుతో తలదించుకున్నాను. అప్పుడే పదో తరగతి ఎలాగైనా పాస్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఓపెన్‌ స్కూల్‌లో చేరి పదో తరగతి పాస్‌ కావడం సంతోషంగా ఉంది. ఇక 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే నా ఎడ్యుకేషన్‌ కాలమ్‌ని గర్వంగా పూర్తి చేస్తా’ అని అరుణ్‌ కుమార్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

బిస్వాజిత్‌ పదోతరగతి మధ్యలోనే మానేశాడు. అనంతరం బిజినెస్‌ చూసుకుంటూ మళ్లీ పరీక్షలకు హాజరు కాలేదు. ‘ఇంట్లో అందరూ చదువుకున్న వారే. నేను నాన్న మాత్రమే పదోతరగతి పాస్‌ కాలేదు. పదో తరగతి ఎలాగైనా చదువాలనే పట్టుదలతో ప్రతి ఆదివారం నేను, నాన్న తరగతులకు హాజరయ్యేవాళ్లం. మా పెద్ద అన్నయ్య కూడా చదువు విషయంలో అండగా నిలిచాడు. పదో తరగతి పాస్‌ అయినందుకు సంతోషంగా ఉంద’ని బిస్వాజిత్‌ తన ఆనందాన్ని పంచుకున్నారు.

మరిన్ని వార్తలు