బిడ్డలపై తాగుబోతు తండ్రి దాడి

2 Jul, 2014 02:24 IST|Sakshi

- ఇద్దరు బాలికలు మృతి
- కుమారుడి పరిస్థితి విషమం
బెంగళూరు :  ఓ తాగుబోతు.. అభం శుభం ఎరుగని తన ముగ్గురు బిడ్డలపై కొడవలి దాడి చేశాడు. తమకు ఏమైనా కష్టం వస్తే ఆదుకోవాల్సిన తండ్రే.. కొడవలితో తమపై దాడి చేయడంతో వారు నిర్ఘాంతపోయారు. మద్యం మత్తులో ఆ చిన్నారులను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఈ అఘాయిత్యంలో ఇద్దరు బాలికలు మరణించగా.. కుమారుడు కొన ఊపిరితో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మాగడి రోడ్డు బ్యాడరహళ్ళి సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తావరకెరె పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తుమకూరు సమీపంలోని నిడసాలె గ్రామంలో రమేష్, గౌరమ్మ నివాసముంటున్నారు. వీరికి ధరణి (14), మోనీషా (11), మోనికా (9) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వీరు వరుసగా తొమ్మిది, ఆరు, నాల్గవ తరగతులు చదువుతున్నారు. రమేష్ ఫైనాన్స్‌లో రెండు ఆటోలో కొనుగోలు చేశాడు. కంతులు సరిగా కట్టకపోవడంతో ఫైనాన్స్ వారు వాటిని తీసుకెళ్లిపోయారు. అనంతరం ఓ ప్రైవేట్ కంపెనీలో రమేష్ ఉద్యోగంలో చేరాడు. మద్యానికి బానిసైన అతను నిత్యం గౌరమ్మతో గొడవ పడేవాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి 7.30 గంటలకు గౌరమ్మతో గొడవపడ్డాడు. విసుగుచెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లిపోయింది.

దీంతో మరింత ఆగ్రహించిన రమేష్.. కొడవలితో తన ముగ్గురు బిడ్డలపై ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్తుండగా.. గౌరమ్మ వచ్చింది. అతని దుస్తులకు రక్తం మరకలు ఉండటంతో అనుమానం వచ్చిన ఆమె అతని చేతిలోని తాళం లాక్కొని ఇంట్లోకి వెళ్లింది. అప్పటికే మోనికా, మోనీషా చనిపోయి ఉండటాన్ని చూసి కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు రమేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కొన ఊపిరితో ఉన్న ధరణిని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషయంగా ఉందని, రమేష్‌ను అరెస్ట్ చేశామని  పోలీసులు మంగళవారం తెలిపారు.

మరిన్ని వార్తలు