తనను చూస్తే గర్వంగా ఉంది : అభినందన్‌ తండ్రి

28 Feb, 2019 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ సైన్యానికి చిక్కిన తన కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ తండ్రి, మాజీ ఐఏఎఫ్‌ అధికారి ఎస్‌ వర్థమాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్‌ ఆ దేశ ఆర్మీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను హింసించినట్లుగా ఉన్న వీడియోలు బహిర్గతం కావడంతో యావత్‌ భారతావని ఆందోళనలో మునిగిపోయింది. దీంతో అభినందన్‌ క్షేమంగా ఉండాలని భారతీయులంతా ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఎస్‌ వర్థమాన్‌.. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి, విపత్కర సమయంలో కూడా అభినందన్‌ ధైర్య సాహసాలు ప్రదర్శించాడన్నారు. ‘ తన కోసం ప్రార్థిస్తున్న ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. అభి బతికి ఉన్నందుకు ఆ దేవుడికి కృతఙ్ఞతలు తెలుపుతున్నా. తను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు. పాక్‌ చేతికి చిక్కినా అభి చాలా ధైర్యంగా ఉన్నాడు. తను నిజమైన సైనికుడు. తనను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ప్రస్తుతం మీ మద్దతు మాకెంతో ధైర్యాన్ని ఇస్తోంది. మీ అందరి ఆశీస్సులతో వాడు క్షేమంగా తిరిగి వస్తే చాలు’ అని ఉద్వేగానికి లోనయ్యారు. కాగా అభినందన్‌ తండ్రి ఎస్‌ వర్థమాన్‌ కూడా వైమానిక దళంలో పనిచేశారు. వారి స్వస్థలం కేరళ అయినా.. అభినందన్‌ కుటుంబసభ్యులు తమిళనాడులోని తాంబరంలో స్థిరపడ్డారు.

ఇక తమ నిర్బంధంలో ఉన్న భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ క్షేమంగా ఉన్నారని, ఆయనకు మందులు, ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. భారత పైలట్‌ను తిరిగి అప్పగించేందుకు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేందుకు సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు