అవివాహిత తల్లికి ‘సుప్రీం’ బాసట

7 Jul, 2015 03:36 IST|Sakshi
అవివాహిత తల్లికి ‘సుప్రీం’ బాసట

తండ్రి హక్కుల కన్నా బిడ్డ సంక్షేమం ముఖ్యమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తన బిడ్డ తండ్రి పేరు వెల్లడించకుండా.. తనను ఆ బిడ్డ సంరక్షకురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేస్తున్న ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో తండ్రికి నోటీసులు జారీ చేయకుండా, అతడి వాదనలు వినకుండా.. ఏకపక్షంగా తల్లిని సంరక్షుకురాలిగా గుర్తించటం సాధ్యం కాదన్న విచారణ కోర్టును.. ఆమె వినతిపై పునఃనిర్ణయించాలని నిర్దేశించింది. తన బిడ్డకు తనను ఏకైక సంరక్షకురాలిగా..

తన లావాదేవీలన్నిటికీ తన బిడ్డను నామినీగా గుర్తించాలని ఒక అవివాహిత తల్లి చేసిన విజ్ఞప్తిని విచారణ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు తిరస్కరించగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారించిన జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ అభయ్‌మనోహర్ సాప్రేలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది.

అవివాహిత తల్లులు, ఒంటరి తల్లుల బిడ్డల విషయంలో.. ఆ బిడ్డకు సంబంధించి బాధ్యతలను విస్మరించిన తండ్రుల చట్టబద్ధమైన హక్కులకన్నా.. ఆ బిడ్డ సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. తన కడుపున బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కోసం అవివాహిత లేదా ఒంటరి తల్లులు దరఖాస్తు చేసుకున్నపుడు.. ఆ ధ్రువీకరణ పత్రాలు జారీచేయటానికి ఆయా తల్లుల ప్రమాణపత్రం(అఫిడవిట్) సరిపోతుందని సంబంధిత అధికారులకు ఆదేశించింది.

మరిన్ని వార్తలు