ట్రిపుల్‌ తలాక్‌ బాధితురాలిపై కఠిన ఫత్వా

18 Jul, 2018 01:28 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇస్లాం సంప్రదాయాలను సవాలుచేసిన ట్రిపుల్‌ తలాక్‌ బాధితురాలు నిదాఖాన్‌పై మత గురువు ఒకరు కఠిన ఆంక్షలు విధిస్తూ ఫత్వా జారీచేశారు. ఆమె జబ్బుపడినా మందులు ఇవ్వొద్దని, ఆమె మరణించిన తరువాత ప్రార్థనలు చేయొద్దని, పూడ్చడానికి స్థలం కేటాయించొద్దని అందులో పేర్కొన్నారు. ఆమెకు సాయం చేసేవారు, మద్దతుగా నిలిచే వారికి కూడా ఇదే శిక్ష అమలవుతుందని తెలిపారు.

ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నిదాఖాన్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు ఆమెతో ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. పురుషహంకార సమాజానికి ఎదురుతిరిగినందుకే తనను బహిష్కరించారని, ట్రిపుల్‌ తలాక్‌ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం తీసుకురావాలని నిదాఖాన్‌ అన్నారు. నిఖా హలాలా బాధితురాలు సబీనాకు నిదా అండగా నిలిచింది. బరేలీలో నివసించే సబీనాకు తొలుత ఆమె భర్త తక్షణ తలాక్‌ విధానం ద్వారా విడాకులిచ్చాడు.

అనంతరం మళ్లీ ఆయనను పెళ్లి చేసుకోవాలంటే.. నిఖా హలాలా ద్వారా మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఆమెకు నిఖా హలాలా విధానంలో భాగంగా సొంత మామ(భర్త తండ్రి)తోనే మళ్లీ పెళ్లి చేశారు. విడాకుల అనంతరం మళ్లీ మొదటి భర్తతో సబీనాకు వివాహం జరిపించారు. ఇక్కడితో ఆమె కష్టాలు తీరలేదు. మళ్లీ సబీనాకు ఆమె భర్త విడాకులిచ్చాడు. ఈసారి సొంత మరిదిని మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేయడం ప్రారంభించారు. ఇక భరించలేక ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న నిదాను సబీనా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే నిదాపై ఫత్వా జారీ అయింది. 

మరిన్ని వార్తలు